రఘువీరా.. రాజీనామా చేయాలి: చింతా
రఘువీరా.. రాజీనామా చేయాలి: చింతా
Published Wed, Aug 30 2017 7:04 PM | Last Updated on Sat, Aug 18 2018 9:03 PM
తిరుపతి: నంద్యాల ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి పోలైన ఓట్లు చూస్తే కడుపు తరుక్కుపోతోందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పార్టీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో బుదవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
తిరుపతి ఉప ఎన్నికలో నిరుపేద మహిళ శ్రీదేవిని అభ్యర్థిగా నిలబెడితే 10 వేల ఓట్లు పోలయ్యాయని, నంద్యాలలో మాత్రం వందల్లో ఓట్లు పడటం పార్టీకి తీరని అవమానంగా, తలవంపులుగానూ ఉందన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికే సరైంది కాదన్నారు. ఎంతో అందమైన వోల్వో బస్సులాంటి కాంగ్రెస్ పార్టీకి చిన్నపాటి రిపేర్ అవసరమని, ఈ బస్సును సమర్థవంతంగా నడిపేందుకు సరైన డ్రైవర్ కావాల్సి ఉండగా కండక్టర్‌ను డ్రైవర్ సీట్లో కూర్చోబెడితే ఎలాగని వ్యాఖ్యానించారు.
నంద్యాల్లో జరిగింది అసలు ఎన్నికే కాదని, కోట్లతో ఓట్లు కొనుగోలు చేసే సంబరానికి ఎన్నికల కమిషన్, దానికో నోటిఫికేషన్ దండగని విమర్శించారు. ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం పాలైందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఆలోచన తప్పిందనీ, ప్రత్యేక హోదా నినాదంతో ఎన్నికల్లో నిలబడటం తోక పట్టుకుని గోదారి ఈదటం వంటిదని వాపోయారు.
Advertisement
Advertisement