Chinta Mohan reddy
-
హుండీలో వేస్తోన్న వజ్రాలు కొందరి చేతుల్లోకి వెళ్తున్నాయి
-
‘దానిలో టీటీడీ బంగారం కూడా ఉంది’
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవకతవకలపై మాజీ ఎంపీ చింతమోహన్ స్పందించారు. ఈ క్రమంలో శనివారం విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన పలు అనుమానాలు లేవనేత్తా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల హుండీ ఆదాయం రోజూ ప్రకటిస్తున్న టీటీడీ అధికారులు.. నిలువు దోపిడీ ఆదాయం వివరాలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. హుండీలో భక్తులు వేస్తోన్న విలువైన వజ్రాలు లెక్కల్లోకి రాకుండా మధ్యలోనే కొందరి చేతుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. టీటీడీలో అసలు జమాలజిస్టులు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాక టీటీడీ బంగారం చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన సమయంలో బోర్డు సభ్యుడిగా ఉన్న శేఖర్ రెడ్డి పాత్ర బయటకు రావాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. గతంలో శేఖర్ రెడ్డి ఇంట్లో జరిగిన దాడుల్లో దొరికిన బంగారంలో టీటీడీ బంగారం కూడా ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. శ్రీవారి సొమ్ము రూ. 11 వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఏ ఏ బ్యాంకులలో ఉన్నాయో భక్తులకు తెలియాలన్నారు. టీటీడీకి, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి మధ్య ఉన్న ఒప్పందం ఏంటో బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బ్యాంక్‌తో టీటీడీకి మధ్య ఉన్న లావాదేవీలు ఏంటో జనాలకు చెప్పాలన్నారు. టీటీడీ అవినీతిపై ఈఓను చర్చకు పిలిచాను.. కానీ అనిల్ కుమార్ సింఘాల్ చర్చకు రాకుండా ముఖం చాటేస్తున్నారని చింతా మోహన్ మండిపడ్డారు. -
రఘువీరా.. రాజీనామా చేయాలి: చింతా
తిరుపతి: నంద్యాల ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి పోలైన ఓట్లు చూస్తే కడుపు తరుక్కుపోతోందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి పార్టీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో బుదవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికలో నిరుపేద మహిళ శ్రీదేవిని అభ్యర్థిగా నిలబెడితే 10 వేల ఓట్లు పోలయ్యాయని, నంద్యాలలో మాత్రం వందల్లో ఓట్లు పడటం పార్టీకి తీరని అవమానంగా, తలవంపులుగానూ ఉందన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికే సరైంది కాదన్నారు. ఎంతో అందమైన వోల్వో బస్సులాంటి కాంగ్రెస్ పార్టీకి చిన్నపాటి రిపేర్ అవసరమని, ఈ బస్సును సమర్థవంతంగా నడిపేందుకు సరైన డ్రైవర్ కావాల్సి ఉండగా కండక్టర్‌ను డ్రైవర్ సీట్లో కూర్చోబెడితే ఎలాగని వ్యాఖ్యానించారు. నంద్యాల్లో జరిగింది అసలు ఎన్నికే కాదని, కోట్లతో ఓట్లు కొనుగోలు చేసే సంబరానికి ఎన్నికల కమిషన్, దానికో నోటిఫికేషన్ దండగని విమర్శించారు. ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం పాలైందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఆలోచన తప్పిందనీ, ప్రత్యేక హోదా నినాదంతో ఎన్నికల్లో నిలబడటం తోక పట్టుకుని గోదారి ఈదటం వంటిదని వాపోయారు.