
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా) : జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ నేత చిరంజీవిలపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడాకి మొదటి ముద్దాయి చిరంజీవే అని ఏలూరు మండలం మాదేపల్లి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కోసం కాపు సోదరులు ఆస్తులు అమ్మి మద్దతు ఇస్తే వాళ్లను బలి పశువు చేసింది చిరంజీవి కాదా అని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని బంగాళాఖాతంలో కలిపిన ఘనత చిరంజీవిదేనని ఎద్దేవా చేశారు.
మీ అన్న చిరంజీవి ఇంత ద్రోహం చేస్తే ఎందుకు అడగలేక పోతున్నావని పవన్‌ను చింతమనేని ప్రశ్నించారు. చిరంజీవిని ప్రశ్నించడానికి రక్తసంబంధం అడ్డొస్తుందా అని మండిపడ్డారు. అలాంటి వాడివి ప్రజారాజ్యం పార్టీని నడిపించలేకపోయావా, జనసేన పార్టీ ఎందుకు పెట్టావు అంటూ నిప్పులు చెరిగారు. ‘పవన్ కల్యాణ్ నీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. నన్ను ఓడించి, జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని ఊగిపోతున్నారు.. మీరు కాదు మీ జేజేమ్మలు దిగొచ్చినా నన్ను ఓడించలేరు’ అంటూ చింతమనేని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment