
హైదరాబాద్ చరిత్ర చిరంజీవికి తెలియదు
* కేంద్రమంత్రిపై అసదుద్దీన్ ధ్వజం
* చిరంజీవికి దమ్ముంటే కడపలో జగన్‌పై పోటీ చేయాలి
* మోడీతో బాబు కలిస్తే టీడీపీని ప్రజలు ఎన్నటికీ నమ్మరు
* నల్లగొండ, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డిల్లోనూ ఆంధ్రులున్నారు.. వాటినీ కేంద్రం పరిధిలోకి తెస్తారా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ చరిత్ర కేంద్రమంత్రి చిరంజీవికి తెలియదని.. హైదరాబాద్ కోసం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేశామనడం ఆయన అవగాహనా రాహిత్యమని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. భారతదేశంలో హైదరాబాద్ నగరం స్వాతంత్య్రానికి పూర్వమే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఇక్కడి ప్రజలకు అన్ని సౌకర్యాలూ అప్పటి నుంచే ఉన్నాయని పేర్కొన్నారు. దమ్ముంటే కడప నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేసి, కేంద్రమంత్రి చిరంజీవి తన రాజకీయ పరిణితిని నిరూపించుకోవాలని అసద్ సవాల్ చేశారు.
హైదరాబాద్‌ను అభివృధ్ధి చేశానని గొప్పలు చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపైనా ఆయన విరుచుకుపడ్డారు. చంద్రబాబు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని కలిస్తే ప్రజలు టీడీపీని ఎన్నటికీ నమ్మరని, ఆయన తన కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించాలని సూచించారు. ఆదివారం మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ హుస్సేన్ జ్ఞాపకార్థం నిర్వహించిన బహిరంగసభలో ఒవైసీ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీజేపీ పుంజుకుని, ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను ఇక్కడ ప్రవేశపెడుతుందనే ఆందోళన వ్యక్తం చేశారు.
మజ్లిస్ పార్టీ మొదటి నుంచీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగానే ఉందని గుర్తు చేశారు. తప్పనిసరై విభజించాల్సి వస్తే.. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని, తెలంగాణకు హైదరాబాద్‌ను రాజధానిగా ఉంచాల్సిందేనని పునరుద్ఘాటించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం కక్కుర్తిపడి హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే ప్రయత్నాలకు మద్దతునిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన వారి ఆత్మ ఘోషను కూడా వీరు పరిగణనలోకి తీసుకోవడం లేదని మండిపడ్డారు.
హైదరాబాద్‌ను యూటీ చేస్తే హెచ్‌ఎమ్‌డీఏ పరిధిలోని 34 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పోగొట్టుకోవాల్సి వస్తుందన్నారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల్ని కేంద్రం పర్యవేక్షించాలన్న ప్రతిపాదనను ప్రస్తావిస్తూ.. నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ ప్రాంతాల్లోనూ ఆంధ్రులున్నారని, వాటిని కూడా కేంద్ర పర్యవేక్షణ కిందకు తెస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ చరిత్రపై ఓ ఆంగ్లపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఖండించారు.