
చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని పూల మార్కెట్ విషయంలో నెలకొన్న వివాదంలో ఆదివారం కూడా నాటకీయ పరిణామాలు నెలకొన్నాయి. పూల మార్కెట్ వద్ద మాజీ ఎమ్మెల్యే సీకే బాబు మళ్లీ నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సీకే బాబు ఉంటున్న కట్టమంచికి ఆదివారం ఉదయం నుంచే పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
పూల మా ర్కెట్ వద్దకు వెళ్లేట్లయితే అదుపులోకి తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సీకే బాబు పలమనేరు రోడ్డులోని క్లబ్ వద్దకు చేరుకున్నారు. ఆయన్ను 50 మంది వరకు పోలీసులు వెంబడించారు. తనను ఎందుకు అనుసరిస్తున్నారని సీకేబాబు పోలీసులను ప్రశ్నించారు. తన వెంట రావద్దని సూచించారు. ఇక టీడీపీ నేతలు సైతం ఎమ్మెల్సీ దొరబాబు కార్యాలయం వద్ద సమాలోచనలు జరిపారు. అటు నుంచి ఎమ్మెల్యే సత్యప్రభ, మేయర్ హేమలత, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నాని తదితరులు కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకు ని నగర అభివృద్ధిపై కమిషనర్‌తో చర్చిం చారు. పూల మార్కెట్ విషయంలో వెన క్కు తగ్గకూడదని నిర్ణయం తీసుకున్నారు.
పేదల కడుపుకొట్టొద్దు..
11 గంటల ప్రాంతంలో సీకే బాబు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ డీఎస్పీ సుబ్బారావుతో మాట్లాడారు. పూల మార్కెట్‌ను అక్కడే ఉంచి పేదలకు న్యాయం చేయాలని కోరారు. అలా కానిపక్షంలో పాత బస్టాండులో తాత్కాలికంగా దుకాణాల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సూచించారు. పేదల కడుపుకొట్టకుండా హుందాగా వ్యవహరిం చాలని కోరారు. దీనిపై స్పందించిన డీఎస్పీ మార్కెట్ తరలింపుపై నగరపాలక సంస్థ నిర్ణయం మేరకు మునిసిపల్ కమిషనర్ ఇక్కడ దుకాణాలు ఉంచకూడదని, పోలీసు బందోబస్తు కల్పించాలని తమకు లేఖ రాశారని తెలిపారు. ఇక్కడ దుకాణా లు పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటా మన్నారు. ఈ పరిణామాలపై ప్రజాకోర్టులో తేల్చుకుంటామని చెప్పి సీకే బాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
30 మందిపై కేసులు..
డీఎస్పీ సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూల మార్కెట్ వద్ద జేసీబీ తీసుకొచ్చి స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించిన 30 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో సీకే బాబు సైతం ఉన్నారని పేర్కొన్నారు. అలాగే కార్తీక్, భాస్కర్, మణి, ప్రదీప్, సురేష్, రవి, షేరు, కార్పొరేటర్ చందు, అఫ్జల్‌ఖాన్, జీవరత్నం, అమీర్ అబ్బాస్, కిశోర్, శ్రీనివాస్ తదితరులను శనివారం రాత్రే అదుపులోకి తీసుకున్నామని చెప్పా రు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామన్నారు. వారికి 14 రోజుల రిమాండుకు ఆదేశించడంతో చిత్తూరు జిల్లాకు జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment