క్రైస్తవుల భూములు తిరిగివ్వాలి
Published Thu, Dec 5 2013 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
కోటగుమ్మం(రాజమండ్రి), న్యూస్‌లైన్ : అన్యాక్రాంతమైన క్రైస్తవుల భూములు వారికి తిరిగివ్వాలని అంతర్జాతీయ సువార్తికులు బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు రెవరెండ్ కొమనాపల్లి ప్రతాప్‌సిన్హా ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. క్రైస్తవుల భూముల వ్యవహారంపై క్వారీ మార్కెట్ సెంటర్‌లోని బత్తిన సుబ్బారావు విగ్రహం వద్ద కార్పొరేషన్ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రే కొండబాబు ఆధ్వర్యంలో 10 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించారు.
ఈ దీక్షల లక్ష్యం నెరవేరాలని అనిల్‌కుమార్ ప్రార్థన చేశారు. ఆయన మాట్లాడుతూ క్రైస్తవుల స్థలాలు కబ్జా చేసి, క్వారీలుగా వినియోగించుకోవడం అన్యాయమన్నారు. క్రైస్తవులకు చెందిన స్థలాలు వారికే చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బర్రే కొండబాబు మాట్లాడుతూ రాజమండ్రి నగర శివారులో 50 ఎకరాలు, రెండున్నర ఎకరాల స్థలాలను కొన్నేళ్లుగా క్వారీ యజమానులు స్వాధీనం చేసుకుని, తవ్వకాలు చేస్తున్నారని వివరించారు. ఆయా స్థలాలను స్వాధీనం చేసుకుని, క్రైస్తవులకు సమాధుల తోట కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రెవరెండ్ ప్రతాప్‌సిన్హా, సుభాకర్ శాస్త్రి, సుధీర్ కుమార్, టాటా విక్టర్, నక్కా రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement