- రూ.500, 1000 నోట్లే అధికం
- వారపు సంతలు, రియల్ ఎస్టేట్ తదితరాలే టార్గెట్
- చెలామణి చేసేందుకు ఏజెంట్ల నియామకం
పలమనేరు: కొంతకాలంగా పలమనేరు నియోజకవర్గంలో దొంగనోట్ల చెలామణి జోరందుకుంది. ముఖ్యంగా రూ.1000, 500 నోట్లే బయటపడుతున్నాయి. వారపు సంతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, రైతులకందే పాల బిల్లులు, గ్రూపులకు చెల్లించే డబ్బులు, పెట్రోల్ బంకు లు తదితరాల్లో ఎక్కువగా చెలామణి జరుగుతున్నట్లు తెలుస్తోంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దొంగనోట్ల చెలామణి అధికంగా పలమనేరు, వి.కోట, బెరైడ్డిపల్లె, గంగవరం మండలాల్లోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు నుంచి కొందరు ఏజెంట్లు ఈ నోట్లను చెలామణి చేస్తున్నట్లు సమాచారం. వీరు స్థానికంగా కొందరు ఏజెం ట్లను ఏర్పాటు చేసుకుని ఒకటికి డబుల్ అనే లెక్కన లక్ష ఫేక్‌నోట్లు రూ.50 వేలు తీసుకుని ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దొంగనోట్లను స్థానిక వారపు సంతల్లో ఎక్కువగా మారుస్తున్నట్లు వినికిడి. డెయిరీల్లో పాల బిల్లులు పొందిన పలువురు పాడి రైతులు సైతం తమకు దొంగనోట్లు వస్తున్నాయని ఇటీవల చెబుతున్నారు.
మహిళా గ్రూపుల్లోనూ ఈ సమస్య ఉంది. నెలకు దాదాపు 30 వరకు దొంగనోట్లను బ్యాంకర్లు గుర్తించి చించిపడేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని వెనుక ఎవరున్నారు అనే విషయం పోలీసులకు సైతం అంతు చిక్కడం లేదు. మూడు రోజుల క్రితం కర్ణాటకు చెందిన ఓ దొంగనోట్ల గ్యాంగ్ గంగవరం పోలీసులు పట్టుబడిన విషయం తెలిసిందే. స్థానికంగా ఇంకా ఏయే గ్యాంగులు చెలామణి చేస్తున్నాయనే విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.