పెదవాల్తేరు(విశాఖ తూర్పు): జిల్లాలో మరోసారి బస్సుల కోసం ప్రయాణికులకు తిప్పలు తప్పని పరిస్థితి నెలకొంది. నగరానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వస్తున్నపుడల్లా సభలు, సమావేశాలు ఉంటే జనాన్ని బలవంతంగా తరలించేందుకు అధికసంఖ్యలో ఆర్టీసీ బస్సులను కేటాయిస్తుండడం రివాజుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ పరిధి అనకాపల్లిలో శుక్రవారం జరిగే మెగా గ్రౌండింగ్ లోన్ మేళాకి లబ్ధిదారులు, ప్రజలను తరలించడానికి బస్సులు కేటాయించారు. నగరంలోని వాల్తేరు, మద్దిలపాలెం, గాజువాక, స్టీల్‌సిటీ, సింహాచలం తదితర డిపోల నుంచి ఇప్పటికే 250 బస్సులను తరలిస్తున్నారు. ఇంకా అదనంగా మరో 50 నుంచి 60 బస్సులు కూడా తరలించే అవకాశాలున్నాయని సమాచారం. అయితే సీఎం సభలకు ప్రైవేట్ బస్సులు అద్దెకు తీసుకోవచ్చు కదా అని పలువురు నగరవాసులు ప్రశ్నిస్తున్నా స్పదించేవారే కరువయ్యారు.
విద్యార్థులు, ప్రయాణికులకు తిప్పలు
నగరంలో రోజూ 650కి పైగా సిటీ బస్సులు తిరుగుతుంటాయి. ముఖ్యంగా విజయనగరం, తగరలపువలస, భీమిలి ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు రోజూ వేలాది మంది విద్యార్థులు బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యమంత్రి పర్యటన సుమారుగా వారం రోజుల క్రితమే ఖరారవుతుంది. కానీ ఆర్టీసీ అధికారులు ఒకరోజు ముందు మాత్రమే పత్రికలకు ప్రకటన పంపుతున్నారు. బస్సుల కొరత కారణంగా మెట్రో బస్సులలో ఉచిత, రూటు, సాధారణ పాసులు చెల్లుతాయని ఆర్టీసీ ఆర్‌ఎం సుధేష్‌కుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ శుక్రవారం ఉదయం పేపరులో ఆ వార్త చదివేసరికే విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లిపోతున్నారు. వీరికి బస్టాపులలో గంటల కొద్దీ ఎదురుచూపులు తప్పడం లేదు. పోనీ బస్టాపులలో మెట్రోబస్ డ్రైవర్లు గానీ, కండక్టర్లు గానీ అన్ని పాసులూ చెల్లుతాయంటూ చెప్పడం లేదు. దీంతో విద్యార్థులంతా ఎప్పటిలాగానే సాధారణ బస్సులలో వేళాడుతూ వెళ్లాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. సాధారణ బస్సులు సీఎం సభకు వెళ్తే... మెట్రో బస్సులు కళాశాలల స్పెషల్ బస్సులుగా తరలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment