సాక్షి, ఒంగోలు: ‘ఎవరేమంటే మాకేమీ.. అధికారం వ చేతుల్లో ఉంది. మేం ఏ చెబితే అదే.. పిల్లిని కుక్కంటాం.. కుక్కని పిల్లంటాం. ఎవరెదురు చెప్తారు?’ అన్నట్లు ఉంది సివిల్ వ్యవహారాల్లో కొంతమంది పోలీసు అధికారుల తీరు. ‘ఇచ్చట సివిల్ కేసులు పరిష్కరించబడవు’ అంటూ తాటికాయంత అక్షరాలతో పోలీస్‌స్టేషన్‌లో బోర్డులు వేలాడుతుంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ సివిల్ కేసులను పరిష్కరించవద్దని ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం ఉన్నాయి. అయినా సరే మేమింతే.. అన్నట్లుగా జిల్లాలోని పలువురు స్టేషన్ హౌస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో పోలీస్ ఠాణాల్లో పేదవారికి ఒక న్యాయం, పెద్ద వారికి మరో న్యాయం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కొన్ని వ్యవహారాల్లో సంబంధిత ఎస్‌హెచ్‌వోలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. ఒంగోలు నగరంలోని పోలీస్‌స్టేషన్లలో సివిల్ పంచాయతీలు, కేసులు నమోదు చేయకుండా ‘రాజీ’లతో సరిపెడుతున్నారు. నగరంలోని ఒక పోలీస్‌స్టేషన్‌లో అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నేత జోక్యం లేనిదే పని కాదు అని బాధితులు వాపోతున్నారు.
ఇటీవల జిల్లాలోని ఒక ఎస్సై ఏకంగా 45 కేసుల్లో ఇరువర్గాలకు రాజీ కుదిర్చి ఏ మాత్రం కేసులు నమోదు చేయకపోవడంతో పోలీసు బాస్ ఆగ్రహానికి గురయ్యారు. వీఆర్‌లో ఉంటూ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పోలీసు పరేడ్ గ్రౌండ్‌కి పరుగులు పెట్టాడు.
నగరానికి చెందిన ఒక పోలీసు అధికారి ఓ కేసును నమోదు చేయకపోవడమే కాకుండా ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. అయితే సదరు కేసును దర్యాప్తు చేయాల్సింది మాత్రం ఆయన పై అధికారే. ఇది తెలిసినా.. అసలు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లక పోగా.. ఒక వర్గానికి చెందిన వ్యక్తి నుంచి మరొకరికి రూ.50 వేలు చెల్లించేలా తీర్పునిచ్చారు. ఇక సదరు అధికారికి, పోలీస్‌స్టేషన్‌కు ఇవ్వాల్సిన మొత్తం మామూలే. కేసుకు సంబంధించిన వివరాలివీ.. నగరంలోని ఓ అపార్టుమెంట్‌కు వాచ్‌మెన్‌గా ఉన్న ఒక వ్యక్తి కొండముచ్చును పెంచుకుంటున్నాడు. అయితే ఆ కొండముచ్చు.. పక్కింట్లో ఉండే ఒక ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్‌కి చెందిన పూలమొక్కలను ధ్వంసం చేస్తోంది. ఈ నేపథ్యంలో సదరు ప్రొఫెసర్ వాచ్‌మెన్‌ను గట్టిగా ప్రశ్నించాడు. ఈ విషయంలో ఘర్షణ పెరగడంతో ఇరువర్గాల వారు పోలీసులను ఆశ్రయించారు. వాచ్‌మెన్ మాత్రం తనను ప్రొఫెసర్ కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేయగా, తనపై వాచ్‌మెన్ దాడికి పాల్పడ్డాడని ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు కాకుండా ఉండేందుకు.. వాచ్‌మెన్‌కు ప్రొఫెసర్ నుంచి రూ.50 వేలను ఇప్పించారు. ఇది ఉన్నతాధికారుల దృష్టికెళ్లింది.
నగరంలోని మరో పోలీస్ అధికారి తన స్టేషన్‌లో తరచూ సివిల్ పంచాయతీలు చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ స్థానిక నేతను మధ్యవర్తిగా ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తాజాగా శివప్రసాద్ కాలనీకి చెందిన ఓ యువకుడిపై గోపాల్‌నగర్‌కు చెందిన ఫైనాన్షియర్ నగదు లావాదేవీల విషయమై ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వ్యవహారంలో ఆ యువకుడు చేసిన నేరం పెద్దగా లేనప్పటికీ సదరు కాంగ్రెస్ పార్టీ నేత మధ్యవర్తిత్వంతో రూ.50 వేలకు బేరం కుదిరినట్లు సమాచారం. ఈ విధంగా పోలీస్‌స్టేషన్లలో అవినీతి రాజ్యమేలుతోంది. దీనికి ముగింపు ఎప్పుడో ఉన్నతాధికారులే చెప్పాలి.
సివిల్ ‘సెటిల్’మెంట్లు
Published Wed, Dec 18 2013 6:20 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement