సివిల్స్‌లో గ్రామీణ యువకుడి సత్తా
413వ ర్యాంకుతో విజయబావుటా
మురిసిపోయిన పార్వతీపురం
అచ్చంగా తెలుగు భాషలోనే చదివాడు. గ్రామీణ ప్రాంతంలోనే ఎదిగాడు. ఉన్నత వైద్యవిద్య అభ్యసించాడు. బంగారు పతకం సాధించాడు. కానీ ప్రజాసేవకు దగ్గరి మార్గమైన సివిల్స్‌ను ఎంచుకున్నాడు. రేయింబవళ్లు చదివాడు. విజయబావుటా ఎగరేశాడు. సివిల్స్ ఫలితాల్లో 413వ ర్యాంకు సాధించాడు. పార్వతీపురానికి జాతీయస్థాయిలో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడు. ఆ యువకుడే రామాపురం కాలనీకి చెందిన పల్లి శ్రీకాంత్. ఉన్నత శిఖరాన్ని అధిరోహించిన ఈ విజేత విజయగాథ అతని మాటల్లోనే..
నాన్న సంజీవరావు నాయుడు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ 1992లో చనిపోయారు. అమ్మ విజయప్రభ పార్వతీపురం ఆర్‌సీఎం జెయింట్ జాన్స్ ఎలిమెంటరీ పాఠశాల (గంటా బడి) ఉపాధ్యాయిని. అమ్మ, మేనమామల సంరక్షణలో చదువుకున్నాను. ప్రాథమిక స్థాయి వరకు కొమరాడ మండలం శివినిలోని ఆర్‌సీఎం జెయింట్ జాన్స్ ఎలిమెంటరీ పాఠశాలలో, 6 నుంచి 10 వరకు పార్వతీపురంలోని ఆర్‌సీఎం జెయింట్ జాన్స్ హైస్కూలు (బాయ్స్ ఆర్‌సీఎం)లోను చదువుకున్నాను. విశాఖలోని శ్రీ చైతన్యలో ఇంటర్ పూర్తయ్యాక, ఆంధ్ర వైద్య కళాశాలలో బంగారు పతకంతో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. నా సోదరి ప్రియాంక ఎం.ఫార్మసీ చేసింది.
పేదలకు నేరుగా సాయం చేయొచ్చని..
వైద్యునిగా ప్రజా సేవ చేయొచ్చు. కానీ సివిల్స్‌లో నెగ్గితే పేదలకు నేరుగా సహాయపడవచ్చు. అందుకే వైద్యవిద్య చదువుతున్నప్పుడే సివిల్స్ వైపు దృష్టి సారించాను. మూడో ప్రయత్నంలో విజయం సాధించాను. సమాజంలో ఎన్నో సమస్యలున్నాయి. వాటికి పరిష్కారాలు కూడా ఉన్నాయి. కానీ అమలు సరిగ్గా లేదు. దీనికి నా వంతు కృషి చేస్తాను.
ఆత్మీయుల అండదండల వల్లే విజయం
రెండుసార్లు సివిల్స్‌లో అపజయం పొందినప్పుడు చలం, సురేష్, జయరామ్, రాజు, నాయుడు, పోలినాయుడు, కిరణ్‌కుమార్, మధుకిశోర్, మోహనరావు, ధనుంజయ నాయుడు, మానస, మనీష, గౌరమ్మ కల్పించిన మనోధైర్యమే నా విజయానికి దోహదపడింది. దీంతో సొంతంగా ప్రిపరేషన్ ప్రారంభించాను. శివశంకర్, శిభిచక్రవర్తి, బాబూజీ తదితర ఐఏఎస్, ఐపీఎస్‌లు నాలో ఆత్మస్థయిర్యం పెరిగేందుకు ఎంతగానో కారకులయ్యారు.
అమ్మ గురించి ఏం చెప్పినా తక్కువే
నాన్న చనిపోయాక నాకు సర్వస్వం అమ్మే అయ్యింది. ఏ నాడూ ‘ఇది చెయ్యి.. అది చెయ్యి’ అనే మాటలు ఆమె నోటివెంట రాలేదు. మామయ్యలు నగిరెడ్డి మధుకిశోర్, మోహనరావు, అమ్మమ్మ గౌరమ్మల సాయం కూడా మరువలేనిది.
మంచి స్నేహితుల్ని ఎంపిక చేసుకోవాలి
ఇప్పుడు యువత ఏ లక్ష్యాన్ని సాధించేందుకుకైనా ఎన్నో అవకాశాలున్నాయి. తనను తాను నిరూపించుకోవాలంటే సెల్ఫ్ కంట్రోల్ అవసరం. కబుర్లు చెప్పే స్నేహితులే కాదు.. మన విజయానికి తాపత్రయపడే వారిని ఎంచుకోవడం మంచిది. - పార్వతీపురం
‘పల్లి’టూరి మొనగాడు ‘శ్రీకాంత్’
Published Mon, Jul 6 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM
Advertisement
Advertisement