
ఉద్యోగుల సమ్మెపై వాదనలు ముగిసినట్టే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటనను నిరసిస్తూ సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో దాదాపుగా వాదనలు ముగిశాయి. గత రెండు వారాలుగా సాగిన వాదనలను రాతపూర్వకంగా తమ ముందుంచాలని, అయితే అవి రెండు పేజీలకు మించరాదని అటు పిటిషనర్లకు, ఇటు ప్రతివాదులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఏపీ ట్రెజరీ సర్వీసు అసోసియేషన్ తరఫున న్యాయవాది ఎమ్మెస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ... సొంత ప్రయోజనాలను ఆశించి దాఖలు చేసే ఇటువంటి వ్యాజ్యాలను కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే పలు తీర్పులు వెలువరించిందని చెప్పారు.
శాంతిభ్రదతల సమస్య తలెత్తితేనే కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఇప్పటికే అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ చెప్పారని, ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏమీ లేవు కాబట్టి, ఈ వ్యవహారంలో కోర్టుల జోక్యం అవసరం లేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, ‘సమ్మె విషయంలో కోర్టు సానుకూల ఉత్తర్వులు ఇస్తే దానివల్ల కేవలం పిటిషనర్ మాత్రమే లబ్ధి పొందుతారా..? ప్రజలకు ఉమశమనం కావాలి కదా? సమ్మెను ఆదిలోనే ఆపేందుకు ప్రయత్నించి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావు’ అని వ్యాఖ్యానించింది. రెండు వారాలుగా ఉద్యోగుల తరఫున పలువురు న్యాయవాదులు చేసిన వాదనలకు పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి సమాధానం ఇస్తూ.. సమ్మెను కొనసాగించడంవల్ల ఉద్యోగులు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని తెలిపారు.
ప్రభుత్వం ప్రజలకోసం కాకుండా ఉద్యోగుల కోసం పనిచేస్తున్నట్లుందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్నామని పిటిషనర్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆ ప్రకటనకు మీరు కట్టుబడి ఉన్నారా..?’ అని ప్రశ్నించగా, తాము కట్టుబడి ఉన్నామని సత్యంరెడ్డి తెలిపారు. అయితే ఆ ప్రకటన ఆధారంగానే ఈ వ్యాజ్యంలో తమ నిర్ణయం ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేయగా... అలాగైతే తమ అఫిడవిట్‌లోని ఆ ప్రకటనను తొలగించాలని సత్యంరెడ్డి కోరారు. దీంతో ధర్మాసనం ఆయన అభ్యర్థనను రికార్డ్ చేసుకుంది. వాదనలు విన్న ధర్మాసనం, ఇరుపక్షాలను కూడా ఇప్పటి వరకు జరిగిన వాదనలను రాతపూర్వకంగా రెండు పేజీలకు మించకుండా కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. రాతపూర్వక వాదనలను పరిశీలించిన తరువాత ఈ మొత్తం వ్యవహారంలో ధర్మాసనం తన తీర్పును వాయిదా వేసే అవకాశం ఉంది.