నిరుద్యోగులను మోసగిస్తున్న బాబు
► అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేల కొనుగోలు
► ప్రభుత్వ తీరుపై ప్రజా ఉద్యమం చేపడతాం
► మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్ల : అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ.. సొంత జీవోలతో సీఎం చంద్రబాబు సీఆర్‌డీఏ పరిధిలో రిజర్వేషన్‌లతో సంబంధం లేకుండా ఉద్యోగాల భర్తీ చేసేందుకు నిర్ణయించటం ద్వారా సొంత మనుషులను నియమించుకొని దోపిడీకి రాజమార్గాన్ని చూపుతున్నారని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో నిరుద్యోగులుగా ఉన్న 1.40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ విషయాన్ని మరిచి ఉద్యోగాలను ఇవ్వకపోగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా తొలగించే పరిస్థితిని తీసుకొచ్చారని విమర్శించారు.
అన్ని రకాల దోపిడీలకు తెర తీసిన చంద్రబాబు చివరికి రాజధాని పరిధిలోని సీఆర్‌డీఏలో రిజర్వేషన్‌కు సంబంధం లేకుండా సొంత పనుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యోగాలు అమ్ముకునేందుకు ఫ్రీ జోన్ చేయకుండా మోసగింపు చర్యలు ప్రారంభించారని మండిపడ్డారు. రెండేళ్లలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించి దోపిడీకి తెరతీసి కరువుతో అల్లాడుతున్న ప్రజలను పట్టించుకోకుండా అక్రమ ఆర్జనతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వటం అత్యంత దారుణమన్నారు.
జన్మభూమి కమిటీల పేరుతో అర్హత లేని ప్రతి ఒక్కరికి పథకాలను కట్టబెడుతూ పేదలను ఇబ్బందిపెడుతున్న చంద్రబాబు.. అర్హత అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. పేదల కోసం ఏమీ చేయకుండా పథకాలన్నీ కార్యకర్తలకు కట్టబెడుతున్న ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రజా ఉద్యమాలను చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ర్ట యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, జిల్లా నాయకులు వెలిదండి గోపాల్, దుర్గి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నం వెంకటేశ్వర్లు, మున్సిపాల్టీలో పార్టీ ఫ్లోర్ లీడర్ బోయ రఘురామిరెడ్డి, నాయకులు శ్రీనివాసశర్మ, నల్ల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.