
సాక్షి, అమరావతి/విజయవాడ: విజయవాడ రోడ్లను సింగపూర్ రహదారుల్లా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని, తాను మళ్లీ తనిఖీకి వచ్చే సమయానికి రోడ్లపై ఎక్కడా గుంతలు కనపడకూడదని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. శనివారం విజయవాడ నగరంలో తనిఖీలు నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఆ తర్వాత తన క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. చుట్టుపక్కల ఉన్న 45 గ్రామాలను విజయవాడ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని, ఇందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
కొండల మీద, కాలువల పక్కన నివసిస్తున్న 50 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వడంతో పాటు 16 వేల మంది లబ్ధిదారులకు వాంబే కాలనీలో ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చేపట్టిన సంస్థపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడలో లైట్ మెట్రో రైలుకు త్వరలో శ్రీకారం చుడతామని చెప్పారు. జక్కంపూడిని ఎకనమిక్ సిటీగా మార్చుతామన్నారు. బుడమేరుతో పాటు మూడు కాల్వలను అనుసంధానం చేయడం ద్వారా జల రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెస్తామన్నారు.