
యోగా క్లాస్‌లో సీఎం డాన్స్
సాక్షి, హైదరాబాద్: ఇన్నర్ ఇంజనీరింగ్ ఫర్ జాయ్‌ఫుల్ లివింగ్‌లో శిక్షణ పొందుతున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు శుక్రవారం రెండో రోజు నృత్యాలు చేశారు. తమిళనాడుకు చెందిన ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఈ శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. శిక్షణ లో భాగంగా ఆలపించే పాటలను శుక్రవారం ఇక్కడ ప్రదర్శించారు. నాలుగైదు పాటలకు అందరూ నృత్యాలు చేశారు.
రెండోరోజు ఉదయం 8 గంటలకే ప్రారంభమైన శిక్షణ సాయంత్రం 6 వరకు కొనసాగింది. ఆసనాలు, క్రియాసంద్ ముద్రలతో శిక్షణ కొనసాగింది. శుక్రవారం శిక్షణకు మంత్రులు, అధికారులు మొత్తం మూడొందల మంది పాల్గొన్నారు. కలెక్టర్లు, మేయర్లు కూడా భాగస్వాములయ్యారు. సీఎం చంద్రబాబు సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు డాన్స్ చేశారు.
మంత్రులు,సీఎస్‌ఐవైఆర్ కృష్ణారావు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అరగంట పాటు తన్మయత్వంతో నృత్యం చేశారు. జాయ్‌ఫుల్ లివింగ్‌లో నృత్యం ఒక భాగమని జగ్గీ వివరించారు. ప్రసిద్ధి చెందిన శాంభవి ఆసనాన్ని నేర్పించారు. ఇది అంతర్గత సామర్ధ్యం పెంచేందుకు, శ్వాస సమస్యలను తగ్గించేం దుకు ఉపయోగపడుతుందన్నారు.
ఎంతో దోహదం: బాబు
యోగా శిక్షణ తరగతులు విధి నిర్వహణ సామర్ధ్యం పెంపునకు దోహదపడతాయని సీఎం చంద్రబాబు చెప్పారు.
పచ్చదనానికి సహకరిస్తాం
‘ప్రాజెక్టు గ్రీన్ హేండ్స్’ పేరుతో ఫౌండేషన్ బృందం ఓ డాక్యుమెటరీని ప్రదర్శించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో 33 శాతం గ్రీనరీ పెంచేందుకు తాము ముందుకొస్తామని జగ్గీ తెలిపారు. ఆర్ అండ్ బీ అధికారి రామచంద్రరాజు.. హైదరాబాద్ శివార్లలోని 50 ఎకరాల సొంత భూమిని నర్సరీలు పెంచేందుకు ఈషా ఫౌండేషన్‌కు ఉచితంగా అందజేశారు.