► కృష్ణా నదిలో అక్రమ నిర్మాణం.. అందులో సీఎం చంద్రబాబు నివాసం
► 21 అక్రమ కట్టడాలను తొలగిస్తామని.. ఆ ఊసే ఎత్తని వైనం
► ముఖ్యమంత్రి నివాసం ఎదురుగా రూ.4.12 కోట్లతో నిర్మాణంలో మరో అక్రమ కట్టడం
► నదీ పరిరక్షణ, పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కడంపై విమర్శలు
► సీఎం చంద్రబాబు తీరును ఆదిలోనే ఎండగట్టిన మేధాపాట్కర్, రాజేంద్రసింగ్
సాక్షి, అమరావతి: నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా కృష్ణా నది గర్భంలో నివాసం ఉంటోన్న సీఎం చంద్రబాబు నాయుడు నదులను పరిరక్షిస్తా నంటూ సుదీర్ఘ ఉపన్యాసాలు చేస్తోండటంపై పర్యావరణవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్‌తో కలసి 1995 నుంచి నదీ పరిరక్షణకు ఉద్యమాలు చేశానని చెప్పడం పట్ల ఆశ్చర్యపోతున్నారు. ‘కృష్ణా నదీ పరిరక్షణ యాత్ర’లో పాల్గొనేందుకు ఆగస్టు 3న ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పర్యటించిన రాజేంద్ర సింగ్ పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తక్షణమే సీఎం తన అక్రమ నివాసాన్ని ఖాళీ చేయాలంటూ డిమాండ్ చేసిన రాజేంద్రసింగ్‌పై నాడు టీడీపీ కార్యకర్తలను ఉసిగొలిపి.. ఇప్పుడు నదుల పరిరక్షణ కోసం దేశంలో తానే మొట్టమొదటగా ఒక విధానాన్ని రూపొందించానంటూ ముఖ్య మంత్రి గొప్పలు పోవడం గమనార్హం. ఈషా ఫౌండేషన్ జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలో చేపట్టిన ర్యాలీ ఫర్ రివర్స్ కార్యక్రమంలో బుధవారం పాల్గొన్న సీఎం.. ప్రజల నీటి అవసరాలు తీర్చేందుకు నదుల అనుసంధానం తాత్కాలికం అని, నదుల పరిరక్షణ శాశ్వత చర్య అని పేర్కొన్నారు.
ఈ క్రమంలో నదీ పరిరక్షణ చట్టాన్ని సాక్షాత్తూ ఆయనే ఉల్లంఘిస్తూ.. తనకేమీ తెలియనట్లు నీతులు వల్లించడం గమనార్హం. నదీ పరిరక్షణ చట్టం 1884 ప్రకారం నదుల తీరాన.. గర్భంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. చివరకు పెద్ద చెట్లు కూడా పెంచకూడదు. పర్యావరణ చట్టాల ప్రకారం నదుల్లో యంత్రాలతో ఇసుక తవ్వకూడదు. అయితే రాష్ట్రంలో 2014 జూన్ 8న ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించాక నదీ పరిరక్షణ చట్టాన్ని, పర్యావరణ చట్టాన్ని తుంగలో తొక్కుతూ వచ్చారు. ఇసుక అక్రమ తవ్వకాలకు తెరలేపి నదుల స్వరూపాన్ని మార్చి వేశారు.
తొలగిస్తామని తిష్ట వేశారు..
కృష్ణా నదిలో 2014 డిసెంబర్ 31న ప్రత్యేక లాంచిలో పర్యటించిన జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు.. నెల రోజుల్లోగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని ప్రకటించారు. కృష్ణా నది గర్భంలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన 21 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే అక్రమ నిర్మాణాలను కూల్చి వేయకపోగా.. అందులో లింగమనేని అతిథి గృహాన్ని సీఎం చంద్రబాబునాయుడు తన అధికారిక నివాసంగా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.
పైగా అక్కడే రక్షణ సిబ్బందికి ప్రత్యేకంగా గదులు, ప్రహరీని అనుమతి లేకుండానే నిర్మించారు. నదీ గర్భాన్ని కబ్జా చేసి.. సీఎం నివాసంలోకి రహదారి నిర్మించారు. తాజాగా ఎలాంటి అనుమతి లేకుండానే సందర్శకుల కోసం రూ.4.12 కోట్లతో ప్రత్యేక భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందుకోసం సీఎం నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూత వేటు దూరంలో కృష్ణా నదీ గర్భాన్ని అడ్డంగా తవ్వేస్తూ ఇసుకను తరలిస్తున్నారు.
ఎత్తిచూపితే ఎదురు దాడే
నర్మదా బచావో ఆందోళన నాయకురాలు మేథాపాట్కర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి కృష్ణా నదిని అడ్డంగా తవ్వేస్తున్న ఇసుకాసురుల తీరును ఎండగట్టారు. సీఎం నివాస గృహం పక్కనే అక్రమ తవ్వకాలను ఆమె ఎత్తిచూపారు. పర్యావరణ చట్టాన్ని అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి వాటిని తుంగలో తొక్కుతున్న తీరును దుయ్యబట్టిన ఆమెపై చంద్రబాబు తన మంత్రులను ఎదురుదాడికి ఉసిగొలిపారు. దుర్భిక్ష అనంతపురం జిల్లాలో వేదవతి(హగరి) నది పునరుజ్జీవం కోసం 1999లో అప్పటి సీఎం చంద్రబాబునాయుడుకు తాను నివేదిక ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాటర్ మ్యాన్ రాజేంద్రసింగ్ అప్పట్లో ప్రకటించారు.
నది జీవనదిగా ఉండాలంటే నదికి ఇరు వైపులా కనీసం రెండు కిలోమీటర్ల వెడల్పుతో మొక్కలు పెంచి పచ్చదనం పెంపొందించాలని జగ్గి వాసుదేవ్, రాజేంద్రసింగ్ చెబుతూనే వస్తున్నారు. ఇదే అంశాన్ని రాజేంద్రసింగ్ బుధవారం మరోసారి చాటి చెప్పి.. సీఎం చంద్రబాబు నిర్వాకాన్ని పరోక్షంగా ఎండగట్టడం గమనార్హం.