సాక్షి, అమరావతి: వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిని ప్రసన్నం చేసుకుని, వారి ఓట్లు కొల్లగొట్టేందుకు తెలుగుదేశం ప్రభుత్వం తంటాలు పడుతోంది. ఆర్టీజీఎస్ ద్వారా లబ్ధిదారులకు ఫోన్ చేసి, ప్రభుత్వ పథకాలతో సంతృప్తి చెందారా? లేదా? అని ప్రశ్నిస్తోంది. ప్రజలు 100 శాతం సంతృప్తి చెందేలా పథకాలను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెబుతుండగా, సంక్షేమ శాఖల పథకాలపై 70 శాతానికి మించి సంతృప్తి వ్యక్తం కావడం లేదని సమాచారం.
ప్రజల్లో సంతృప్తి శాతాన్ని పెంచాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపైనే ఉందని చంద్రబాబు ఉద్భోదిస్తున్నారు. లబ్ధిదారుల్లో సంతృప్తిని పెంచేందుకు ప్రత్యేక సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాస్తవానికి ఇప్పుడు లభిస్తున్న సంతృప్తి శాతం ప్రభుత్వ పథకాలపై అభిమానంతో కాదని నిపుణులు చెబుతున్నారు. సంతృప్తి చెందలేదని చెబితే ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయనే భావనతో చాలామంది అంతా బాగుందంటూ కితాబిస్తున్నారని అంటున్నారు.
టీడీపీకి ఓటు వేయాలట!
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో ఉద్యోగులు, కార్మికులు, రైతులు, ఇతర వర్గాలకు పలు హామీలు ఇచ్చారు. క్రెడిట్ తానే కొట్టేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు వాటి అమలుపై దృష్టి పెడుతున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్‌వాడీ టీచర్లకు జీతాలు పెంచుతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు అంగన్‌వాడీలకు జీతాలు పెంచారు.
ఆశా వర్కర్లకు సైతం జగన్ హామీ ఇవ్వగానే జీతాలు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. హోంగార్డులకు కూడా జగన్ హామీ ఇచ్చారు. వారికి కూడా జీతాలు పెంచుతున్నట్లు సీఎం వెల్లడించారు. డ్వాక్రా యానిమేటర్లు జగన్‌ను కలిసి తాము ఎలాంటి వేతనం లేకుండా ప్రభుత్వానికి సేవ చేస్తున్నామని తెలియజేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే నెలకు రూ.10వేలకు పైగానే జీతం ఇస్తామని జగన్ ప్రకటించారు.
దీంతో అదేరోజు సాయంత్రం కొందరు యానిమేటర్లను సీఎం ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. జీతాలు పెంచే ఆలోచన ప్రభుత్వానికి ఉందని చెప్పారు. హోం గార్డులు, అంగన్‌వాడీ వర్కర్లతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలంటూ ఆయా సంఘాల నాయకులతో ఓట్టు వేయించుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment