బలవంతపు భూసేకరణపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి : రాజధాని గ్రామాల్లో బలవంతపు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మండిపడ్డారు. రాజధాని నిర్మాణంలో భాగంగా భూ సమీకరణ పేరు తో రైతులను మభ్యపెట్టి బెదిరించారన్నారు. పోలీసులతో అక్రమంగా నిర్భందించి కేసులు బనాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆస్తులు తగల బెట్టించారన్నారు. ఇలా రైతులు, కౌలురైతులు, కూలీలను నిలువుదోపిడీ చేసిన ముఖ్యమంత్రి, మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ల నిజస్వరూపం భూసేకరణ నోటిఫికేషన్ తో తేటతెల్లమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూసేకరణలో చట్టవిరుద్ధంగా వెళుతున్న గ్రామ స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి ముఖ్యమంత్రి వరకు, సీఆర్‌డీఏలో అటెండర్ నుం చి కమిషనర్ వరకు అందరిని కోర్టుబోనులో నిలబెడతామని పేర్కొన్నారు. పచ్చటి భూములను చంద్రబాబు తనతో పాటు తన అనుయాయుల అక్రమ సంపాదన కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, సింగపూర్‌వారికి అప్పనంగా దోచిపెట్టడానికి భూసేకరణ పేరుతో మార్గం సుగమం చేసుకున్నారని విమర్శించారు. రైతును రాజుగా చూడాలని కలలు కని అధికారంలోకి రాగానే చేసి చూపిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాలకు తూట్లు పొడిచిన చంద్రబాబు రాష్ట్ర చరిత్రలో రైతుద్రోహి,ైరె తుకూలీ హంతకుడిగా మిగిలిపోతారని దుయ్యబట్టారు.
భూసేకరణపై బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను నెగ్గించుకొనేందుకు వెనకడుగు వేసినా పట్టించుకోని చంద్రబాబు భూసేకరణకు వెళ్లారని, బీజేపీ చంద్రబాబును నిలువరించకుంటే బీజేపీ,టీడీపీ ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పట్టించేందుకు రాష్ర్టప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా రాజధాని కావాలని అందరూ కోరుకుంటున్నారని చంద్రబాబు మాత్రం తన రాజధాని, తన అక్రమాస్తులు కూడబెట్టుకొనే రాజధాని కోసం ఎందరినైనా బలిచేసేందుకు వెనుకాడడం లేదన్నారు. చంద్రబాబు అకృత్యాలను మానవతావాదులంతా ఖండించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.
రాజధాని పేరుతో బాబు నిలువుదోపిడీ
Published Sat, Aug 22 2015 1:35 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement