ఇప్పటివరకు రాజధాని పరిధిలోని గ్రామాల్లో భూసమీకరణ పేరుతో రైతులతో పరోక్షయుద్ధం చేసిన ప్రభుత్వం.. భూసేకరణ నోటిఫికేషన్‌తో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీసింది. ప్రభుత్వం రైతులను భయకంపితులను చేసి తమ లక్ష్యాన్ని చేరుకొనేందుకు సేకరణ అస్త్రాన్ని ఉపయోగిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంగళగిరి :బలవంతపు భూసేకరణను నిలుపుదల చేయాలని కోరుతూ శుక్రవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాకు మంగళగిరి నియోజకవర్గం నుంచి రైతులు భారీగా తరలివెళ్లారు. తమ ప్రాంతంలో పండించే కూరగాయల అక్కడ ప్రదర్శించి నిరసన తెలిపారు. ఎలాంటి బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరించారు.
మంత్రుల ప్రకటనపై ఆగ్రహం..
రాజధాని భూసమీకరణ ప్రారంభించినప్పుడు మం త్రులు 29 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామాన్ని తొలగించబోమని, రైతులకు ఇష్టం లేకుండా ఒక్క ఎకరా తీసుకోబోమని నమ్మించేందుకు ప్రకటనలు చేశారని రైతులు గుర్తు చేస్తున్నారు. అదే మంత్రులు నేడు.. అభివృద్ధి జరగాలంటే భూసేకరణ చేయకుంటే ఎలా కుదురుతుందని, కొందరు నష్టపోవడం తప్పనిసరి అని చెబుతున్నారని తెలిపారు. కొన్ని గ్రామాలను తరలించక తప్పదంటూ వారు చేస్తున్న ప్రకటనలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
23న ఉద్యమ సంస్థ ఆవిర్భావం..
రైతులకు అండగా నిలిచేందుకు పార్టీలకు అతీతంగా ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 23 వతేదీ గుంటూరు వజ్రం హోటల్‌లో పౌరసమాజం పేరుతో ఉద్యమసంస్థ ఆవిర్భావం కానుంది. ప్రభుత్వ దమనకాండను ఎదుర్కోవాలంటే అందరూ ఏకమై పోరాటం చేయడమే మార్గమని మేధావులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సర్వేలతో హడావుడి..
మరోవైపు వారంరోజులుగా గ్రామాల్లో రోడ్ల విస్తరణకు సర్వేలు చేపడుతున్నారు. ఎక్స్‌ప్రెస్ హైవే పేరుతో నిర్వహించిన సర్వేతో తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని అనేక నివాసాలు తొలగించాల్సి వస్తుందని, దీంతో సగానికి పైగా గ్రామాల్లో నివాసాలకు ప్రమాదం పొంచివుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. మంగళగిరి నుంచి తుళ్ళూరు వరకు రోడ్డు విస్తరణ చేపట్టితే నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, శాఖమూరు గ్రామాల్లో సైతం అనేక నివాసాలను తొలగించాలని అధికారులు చెబుతున్నారు. ఓ వైపు భూసేకరణ నోటిఫికేషన్ మరో వైపు రోడ్ల విస్తరణ సర్వేలు.. గ్రామస్తులను నిదురలేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ తీరు రైతుల్లో కలవరం కలిగిస్తోంది.
సేకరణం
Published Sat, Aug 22 2015 1:37 AM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM
Advertisement
Advertisement