మంగళగిరి
రాజధాని భూ సమీకరణకు భూములు ఇవ్వని గ్రామాల్లో భూసేకరణ చేసేందుకు సీఆర్‌డీఏ అధికారులు చేస్తున్న సామాజిక అంచనా ప్రభావంలో ఆయా గ్రామాల్లోని ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మంగళగిరి మండలం నిడమర్రు, బేతపూడి, తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో భూసమీకరణను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించగా వారికి వ్యవసాయం చేసుకునేందుకు కోర్టు తీర్పులివ్వగా మళ్లీ సేకరణ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.
గ్రామాల్లో ఎనభై శాతం మంది అంగీకరిస్తేనే భూసేకరణ చేయాలని 2013 చట్టం చెబుతోందని, ఆ మేరకు ఆయా గ్రామాల్లోని ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని సేకరించి 80 శాతం అంగీకరించిన అనంతరమే భూసేకరణ నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉంటుందన్నారు. సామాజిక అంచనా ప్రభావం పేరుతో కేవలం పంచాయతీ కార్యాలయాల్లో భూములు ఇవ్వని సర్వే నంబర్లతో నోటిఫికేషన్ ప్రకటించి మరోసారి మోసం చేయాలని చూస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
2013 భూసేకరణ చట్టంలో మార్పులు చేసి కార్పొరేట్ కంపెనీలు, బడాసంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు నాలుగుసార్లు ఆర్డివెన్స్ తెచ్చి మరీ ప్రయత్నించిన కేంద్రప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందక వెనుకడుగు వేసిందన్నారు. కిసాన్ రాజ్యం అని చెప్పుకుంటూ మన్ కీ బాత్ రేడియో ప్రోగ్రాం ద్వారా రైతులు, కూలీలకు దగ్గర అవ్వాలని చూస్తున్న ప్రధాని నరేంద్రమోదీ యూపీఏ తెచ్చిన భూసేకరణ చట్టం 2013 మంచిదని నమ్మినా, స్వపక్ష, విపక్షంలోని ముఖ్యమంత్రి చంద్రబాబులాంటి కొద్ది మంది రైతు వ్యతిరేక వ్యక్తుల కోసం చట్టసవరణ చేయాలనుకుని భంగపాటుకు గురయ్యారని విమర్శించారు.
భూసేకరణ చట్టాన్ని సవరించేందుకు కేంద్రప్రభుత్వంలోని స్వపక్షంలోని రాష్ట్రాలే అంగీకరించలేదన్నది గమనించాలన్నారు. భూసమీకరణకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లిన రైతుల్ని గతేడాది ఫిబ్రవరి 28న శాసనసభ సాక్షిగా సమీకరణకు అంగీకరించకుంటే సేకరణ చేస్తామని బెదిరించారని మండిపడ్డారు. ఒక వైపు సమీకరణకు మీ ఇష్టమైతే భూములు ఇవ్వండి లేకపోతే లేదని చెప్పిన ముఖ్యమంత్రి, మంత్రులు భూసేకరణకు ఎలా నోటిఫికేషన్ జారీ చేస్తారని ప్రశ్నించారు. రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలకు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేని ప్రభుత్వం కోర్టు తీర్పులను ధిక్కరించి సేకరణకు వెళితే ఉద్యమాన్ని ఉధృతం చేసి రైతులకు అండగా వైఎస్సార్ సీపీ ఉంటుందని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు.