పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ
పంచాయతీ ఆదాయానికి {పభుత్వం మోకాలడ్డు
భూసేకరణ పేరుతో భూముల
క్రయవిక్రయాలపై ఆంక్షలు
నాలుగేళ్లుగా జమకాని స్టాంప్‌డ్యూటీ
భూసేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ కారణంగా జిల్లాలో పలు పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ ఆగిపోయింది. నాలుగేళ్ల నుంచి
భూముల క్రయవిక్రయాలు ఆగిపోయి రూపాయి ఆదాయం లేక పంచాయతీలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. జనరల్ ఫండ్స్‌కు జమ అయ్యే ఈ స్టాంప్‌డ్యూటీ నిలిచిపోవడానికి ప్రభుత్వ నిర్వాకమే కారణమని పలువురు సర్పంచ్‌లు వాపోతున్నారు.
నక్కపల్లి : పంచాయతీల్లో సాధారణ నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. అభివృద్ధిపనులు, పంచాయతీల నిర్వహణ భారమవుతోందని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో జరిగే భూముల క్రయవిక్రయాలకు సంబంధించి మార్కెట్ విలువపై సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెల్లించే స్టాంపు డ్యూటీలో 24శాతం స్థానిక సంస్థలకు జమవుతుంది. 15శాతం పంచాయతీలకు, 5శాతం మండలపరిషత్‌లకు, 4.25శాతం జెడ్పీలకు చేరుతుంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వారు ఈ నిధులను ట్రెజరీలకు పంపిస్తే ప్రతిమూడునెలలకు ఒకసారి స్టాంప్‌డ్యూటీ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేస్తారు. జిల్లాలో పీసీపీఐఆర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 2013 ఆగస్టు 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. తీరప్రాంత పరిధిలో పీసీపీఐఆర్ కిందకు వచ్చే గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలను నిలిపివేసింది. జిరాయితీ భూములను సయితం అమ్ముకోవడం, కుదువ పెట్టడానికి వీలు పడని దుస్థితి. జిల్లాలో 7 మండలాల్లోని 82 గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. పీసీపీఐఆర్ పరిధిలోకి వచ్చే గ్రామాలలో భూముల క్రయవిక్రయాలు చేయొద్దంటూ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీతో లావాదేవీలు నిలిచిపోయాయి. నక్కపల్లి మండలంలో దాదాపు 8 గ్రామాల్లో పరిస్థితి మరోలా ఉంది. ఈ మండలంలో ఇండస్ట్రియల్‌పార్క్ నిర్మాణానికి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా ఐదువేల ఎకరాలసేకరణకు ఐదేళ్లక్రితం 4(1)నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. వేంపాడు, అమలాపురం, నెల్లిపూడి, రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, బంగారయ్యపేట, గునిపూడిగ్రామాల్లో భూముల క్రయవిక్రయాలపై ఆంక్షలు విధించింది.
ఈ ఐదేళ్ల నుంచి భూముల లావాదేవీలు నిలిచిపోయాయి. క్రయవిక్రయాలు జరిగితే పంచాయతీలకు స్టాంప్‌డ్యూటీ ఆదాయం బాగానే లభించేది. రెవెన్యూ విస్తీర్ణంతక్కువగా ఉండి చిన్నపంచాయతీలకయితే ఏడాదికి రూ.20 వేల నుంచి రూ.50వేల వరకు, ఎక్కువ భూములు కలిగి పెద్దపంచాయతీలకు రూ.50వేల నుంచి రూ. 1.5లక్షల వరకు ఆదాయం లభించేది. నాలుగేళ్ల నుంచి స్థానిక సంస్థలు ఈ ఆదాయాన్ని కోల్పోయాయి. భూసేకరణకు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం క్రయవిక్రయాలపై ఆంక్షలు విధించడం అమానుషమని రైతులు ఆరోపిస్తున్నారు. పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేయకపోగా స్టాంప్‌డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా రాకుండా చేస్తోందంటూ పలువురు సర్పంచ్‌లు మండి పడుతున్నారు. పంచాయతీలకు స్టాంప్ డ్యూటీయే ప్రధాన ఆదాయమని ఈ నిధులను సిబ్బంది జీతాలు, పారిశుధ్య కార్యక్రమాలు, వీథిలైట్ల నిర్వహణ వంటి పనులకు ఉపయోగిస్తామని స్టాంప్ డ్యూటీ ఆదాయం నాలుగేళ్లనుంచి రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటూ వాపోతున్నారు.
మూడేళ్లుగా స్టాంప్‌డ్యూటీ లేదు
పంచాయతీల నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం నిధులివ్వడం లేదు. కేంద్రం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులపైనా పెత్తనం చేస్తోంది. వాటిని విద్యుత్ చార్జీలకు మినహాయించారు. ఈ నిధులను కేవలం తాగునీరు, రోడ్ల నిర్మాణానికే వెచ్చించాలి. పంచాయతీల నిర్వహణకు స్టాంప్‌డ్యూటీ నిధులే అధారం. మా పరిధిలో భూముల క్రయవిక్రయాలు ఆపేయడంతో స్టాంప్‌డ్యూటీ రావడం లేదు.
- సూరాకాసుల రామలక్ష్మి, సర్పంచ్, అమలాపురం