'చంద్రబాబు ఓ చరిత్ర రాస్తున్నారు'
హైదరబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో సమావేశం తర్వాత రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు బుధవారం హైదరాబాద్లో వెల్లడించారు. రైతుల ఆనందాన్ని, సంతోషాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవని తెలిపారు. తమ ప్రాంతానికి రాజధాని రావడమంత మహభాగ్యం మరొకటి లేదని గుంటూరు జిల్లా రైతులు బాబుకు తెలిపారని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు రైతులంతా జేజేలు పలికారని చెప్పారు.మరికొందరైతే చంద్రబాబు ఫోటో పెట్టుకుని పూజిస్తామంటున్నారని తెలిపారు.
ల్యాండ్ పూలింగ్పై సమావేశం ఈ రోజు ఉదయం జరిగిందని చెప్పారు. త్వరలో ఏయే గ్రామాలు రాజధాని పరిధిలోకి వస్తాయో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. చట్టబద్ధత కూడా కల్పిస్తామన్నారు. అయితే ఏ రూపంలో చట్టబద్ధత కల్పిస్తామన్న అంశంపై సీఎం అధికారులతో చర్చించారని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ప్రత్యేక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారస్తులుగా ఎదగాలని రావెల ఆకాంక్షించారు.
కూలీల నైపుణ్యాలు పెంచడానికి ఓ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు. మాన్యువల్ పద్దతిలో పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. ప్రస్తుతానికి ఈ పద్దతిలో అమలు చేయలేకపోతున్నామన్నారు. సర్వే కోసం అత్యాధునిక యంత్రాలు తెప్పిస్తామన్నారు. భూముల రికార్డులన్నీ అత్యాధునిక పద్దతిలో అప్గ్రేడ్ చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని కోసం సమీపంలోని శాండ్ రీచెస్పై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఏది ఏమైనా రాజధాని విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఒక చరిత్ర రాస్తున్నారని రావెల కిషోర్ బాబు అన్నారు.