హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తిరగబడరా..?
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్
తెనాలి : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రెండేళ్లయినా అమలుచేయక పోతే ప్రజలు తిరగబడక ఏం చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ప్రశ్నించారు. ‘మోసకారికి ప్రజలు ఇంకెలా బుద్ధి చెబుతారు...అంటూ జగన్ ప్రశ్నించడంపై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా నోరు పారేసుకోవడం సమంజసంగా లేదన్నారు. పార్టీ నేతలతో కలిసి శనివారం శివకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, రూ.2 వేల చొప్పున నిరుద్యోగభృతి, అన్న క్యాంటీన్లు హామీలను రెండేళ్లయినా అమలు చేయకపోవడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆస్తి దస్తావేజులు, నగలు బ్యాంకుల్లో ఉండిపోయి అప్పులు పుట్టక రైతులు అవస్థలు పడుతున్నారని చెప్పారు.
ఈనెల 27 నుంచి సచివాలయ పరిపాలన వెలగపూడి నుంచేనన్న చంద్ర బాబు ప్రకటన అసాధ్యమని శివకుమార్ సవాల్ చేశారు. హామీలు అలా వుంచితే ఎన్టీఆర్‌ను పదవినుంచి దించడానికి వైస్రాయ్ హోటల్ సాక్షిగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే సంస్కృతిని ఆరంభించిందీ, ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించిందీ చంద్రబాబేనన్నారు. సమావేశంలో పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుద్దపల్లి నాగరాజు, పార్టీ కౌన్సిలర్లు కుక్కల ముక్తేశ్వరరావు, బచ్చనబోయిన శ్రీనివాసరావు, ఎంపీటీసీ సంకురు బుజ్జిబాబు, రాష్ట్ర నేతలు, పట్టణ వివిధ విభాగాల అధ్యక్షులు ఎన్.శివనాగేశ్వరరావు, బొమ్ము నాగిరెడ్డి, పెరికల కాంతారావు, బూరెల దుర్గా, షేక్ దుబాయ్‌బాబు, ఎం.కొండా యాదవ్, తట్టుకూళ్ల అశోక్‌యాదవ్, అక్కిదాసు కిరణ్, పాముల రూజ్‌వెల్ట్, కరాటపు రాజమోహన్ ఉన్నారు.