బాబు 420
► ప్రజలను మోసగించిన సీఎంపై ఫిర్యాదు
► కేసులు నమోదు చేయాలని వైఎస్సార్ సీపీ డిమాండ్
► నిరసన ప్రదర్శనలకు భారీఎత్తున జనం హాజరు
సాక్షి ప్రతినిధి - నెల్లూరు : ఎన్నికల సమయంలో ఆల్ ఫ్రీ అంటూ అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటి గురించి పట్టించుకోని సీఎం చంద్రబాబు నాయుడు మోసకారితనంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. ప్రజలను నిలువునా మోసం చేసిన ఆయనపై కేసులు నమోదు చేయాలని పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశాయి. పార్టీ శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, జిల్లా మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు.
► సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలో పార్టీ జిల్లా
అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి రోడ్డు నుంచి పోలీసు స్టేషన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ముత్తుకూరు, వెంకటాచలం, తోటపల్లిగూడూరు జెడ్పీటీసీ సభ్యులు నెల్లూరు శివప్రసాద్, మందల వెంకటశేషయ్య, చిరంజీవులు గౌడ్, మండల పార్టీ క న్వీనర్లు, ఎంపీపీలు, అన్ని మండలాల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబు మీద కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
► నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నాలుగో పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు మీద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
►కావలిలో ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదు చేయాలని ఆయన వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు మీద కేసు నమోదు చేసి రశీదు ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి సీఐ వెంకటరమణను డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఇబ్బంది పడ్డారు. కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు.
► వెంకటగిరిలో జిల్లాపరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వైస్ చైర్‌పర్సన్ పొట్టేళ్ల శిరీష, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేరిగ మురళీధర్ నేతృత్వంలో నిరసన ప్రదర్శన జరిగింది. నియోజక వర్గం నలుమూలల నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు ఇతర ముఖ్య నాయకులు, మండల కన్వీనర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు. చంద్రబాబు మీద కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
► సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి పోలీసు స్టేషన్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి పోలీసుస్టేషన్‌లో చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పార్టీ మహిళా విభాగం కార్యదర్శి నలుబోయిన రాజసులోచనమ్మ, కేంద్ర కమిటీ సభ్యులు కామినేని సత్యనారాయణరెడ్డితో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
► వైఎస్సార్‌సీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు బస్టాండు నుంచి పోలీసు స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చనందుకు ఆయన మీద 420 కేసు నమోదు చే యాలని ఎస్సై విజయకుమార్‌కు వినతిపత్రం అందచేశారు.
► ఆత్మకూరు నియోజక వర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి పోలీసు స్టేషన్ వరకు నిరసన ప్రదర్శన జరిపారు. అనంతరం చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన మోసాలపై కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
► కోవూరు పోలీస్‌స్టేషన్ వద్ద నియోజకవర్గంలోని ఐదు మండలాల నేతలు ధర్నా నిర్వహించారు. తొలుత ఆర్‌అండ్‌బీ అతిధిగృహం నుంచి ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. ఎన్నికల హామీలు అమలుచేయకుండా చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేశాడని, చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలని ఎస్సై సుధాకర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, ప్రధాన కార్యదర్శి దొడ్డంరెడ్డి నిరంజన్‌బాబు రెడ్డితో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.
► గూడూరులో పార్టీ నాయకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి నేతృత్వంలో ఆర్ అండ్ బి అతిధి గృహం నుంచి నిరసన ప్రదర్శన జరిగింది. టవర్ క్లాక్ వద్ద బహిరంగ సభ నిర్వహించి చంద్రబాబు మోసాలను ఎండగట్టారు. వాకాడు, కోట, చిట్టమూరు మండల పార్టీ కన్వీనర్‌లు నేదురుమల్లి ఉదయశేఖర్‌రెడ్డి, సంపత్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డిలతో పాటు నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు.
► నెల్లూరు నగరంలోని రెండవ నగర పోలీస్‌స్టేషన్ ఎదుట జరిగిన నిరసనల కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ నేతృత్వంలో చంద్రబాబు నయవంచనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.