పోల‘వరం’పై మరో రియాలిటీ షోకు తెర
►డిజైన్‌లే రూపొందని కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించిన సీఎం
►డిజైన్‌లు రూపొందించడం, సీడబ్ల్యూసీ ఆమోదం పొందడంలో
►ప్రభుత్వం ఘోర వైఫల్యం!
పోలవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోల‘వరం’పై మరో రియాలిటీ షోకు తెరతీశారు. నాబార్డు రుణం మంజూరు.. కాంక్రీట్ పనుల ప్రారంభం.. డయాఫ్రమ్ వాల్ పనులకు అంకురార్పణ పేరుతో హడావుడి చేసినట్లే... కాఫర్ డ్యామ్ పనులను గురువారం ప్రారంభించారు. అయితే ఇప్పటివరకూ కాఫర్ డ్యామ్ డిజైన్‌లే రూపొందించకపోవడం, సీడబ్ల్యూసీ ఆమోదం పొందకపోవడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పాక్షికంగా.. 2019 నాటికి పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు పదే పదే ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ 26 సార్లు వర్చువల్ ఇన్‌స్పెక్షన్, 17 సార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పరుగులెత్తిస్తున్నానని ప్రకటిస్తున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
పోలవరం ప్రాజెక్టులో భాగంగా మూడు కొండల మధ్యన 2,454 మీటర్ల పొడవున ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌ను నిర్మించాలి. గోదావరి ప్రవాహాన్ని మళ్లించగలిగితేనే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు చేసేందుకు అవకా శం ఉంటుంది. అందుకోసం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ (రాతి మట్టికట్ట)కు 400 మీటర్ల ఎగువన 2454 మీటర్ల పొడవుతో ఒకటి, 200 మీటర్ల దిగువన 1467 మీటర్ల పొడవుతో మరొక కాఫర్ డ్యామ్‌ను నిర్మించాలి. వీటిని 41 మీటర్ల ఎత్తు వరకూ నిర్మించడానికి సీడబ్ల్యూసీ ఏడాది క్రితమే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినా.. ఇప్పటివరకూ డిజైన్‌లను రూపొందించడంలో సర్కార్, కాంట్రాక్టర్ పూర్తిగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో 2018 నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం ఆయకట్టుకు నీళ్లందించడం అసాధ్యమని స్పష్టమవుతోంది.
సమీక్షల పేరుతో తమాషా!
పోలవరం ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి పునాది (డయాఫ్రమ్ వాల్) పనులను బావర్, ఎల్ అండ్ టీ సంస్థలకు సబ్ కాంట్రాక్టు కింద అప్పగించారు. ఈ ఏడాది 667 మీటర్లు, వచ్చే ఏడాది 1053 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రస్తుతం 334 మీటర్ల పొడవున డయాఫ్రమ్ వాల్ పనులను పూర్తి చేశారు. కానీ.. ఇప్పటివరకూ కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించలేదు. కాఫర్ డ్యామ్ డిజైన్‌లపై ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్ రమణ నుంచి ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు సాంకేతిక సహకారం అందిస్తోంది.
డిజైన్‌లకు మెరుగులు దిద్ది.. సీడబ్ల్యూసీ ఆమోదం పొందేలా చూడటానికి కేంద్ర జలవనరుల శాఖ ఏబీ పాండ్య నేతృత్వంలోని డిజైన్స్ రివ్యూ ప్యానల్(డీఆర్‌పీ)ను ఏర్పాటు చేసింది. ప్రతి సోమవారం పోలవరం పనులను సమీక్షిస్తున్నానని సీఎం పదే పదే చెప్పడమే తప్ప.. ఇప్పటికీ కాఫర్ డ్యామ్ డిజైన్‌లనే రూపొందించలేకపోవడం గమనార్హం. వర్చువల్ ఇన్‌స్పెక్షన్, క్షేత్ర స్థాయి పర్యటనలతో సీఎం చంద్రబాబు రియాలిటీ షోను తలపించేలా తమాషా చేస్తున్నారని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.
నేల విడిచి సామే!
పోలవరం ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ (ఎఫ్‌ఆర్‌ఎల్) 45.72 మీటర్లు. కనీస నీటి నిల్వ (ఎండీడీఎల్) 41.5 మీటర్లు. పోలవరం ప్రాజెక్టులో 40.54 మీటర్లలో నీళ్లుంటే ఎడమ కాలువకు.. 40.23 మీటర్లలో నీళ్లుంటే కుడి కాలువకు గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేయవచ్చు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే కాఫర్ డ్యామ్‌ను 41 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని నిర్ణయించారు. కానీ.. స్పిల్ వే పనులు నత్తనడకన సాగుతున్నాయి. మొత్తం 52 బ్లాక్‌లకుగానూ 29 బ్లాక్‌ల్లోనే పునాది పనులకు కాంక్రీట్ వేస్తున్నారు. 2018 నాటికి 41 మీటర్ల ఎత్తుతో స్పిల్ వే పూర్తి చేస్తేనే కాఫర్ డ్యామ్‌ను 41 మీటర్ల ఎత్తుతో నిర్మించవచ్చు. కానీ.. 2018 నాటికి స్పిల్ వే 41 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయడం సాధ్యం కాదని పోలవరం అధికారులే తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాఫర్ డ్యామ్‌పై మల్లగుల్లాలు పడుతున్నారు. 31 మీటర్ల ఎత్తుతో కాఫర్ డ్యామ్‌ను నిర్మించి.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభించాలన్నది ప్రభుత్వం తాజా ఆలోచన.
ఇదే అంశంపై ఈనెల 7, 8న ఏబీ పాండ్య నేతృత్వంలోని డీఆర్‌పీ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఒకవేళ 31 మీటర్ల ఎత్తుతో కాఫర్ డ్యామ్‌ను నిర్మిస్తే గ్రావిటీ ద్వారా పోలవరం కాలువలకు నీటిని సరఫరా చేసేందుకు అవకాశం ఉండదు. స్పిల్ వే పనులు వేగవంతం చేసి.. 41 మీటర్ల ఎత్తుతో కాఫర్ డ్యామ్ నిర్మించాలని నిర్ణయించినా 2018 నాటికి పూర్తయ్యే అవకాశం లేదు.
ఎందుకంటే నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల కురిసే జూలై నుంచి డిసెంబర్ మొదటి వారం వరకూ గోదావరిలో వరద ప్రవాహం ఉంటుంది. అంటే ఆర్నెళ్లపాటు పనులు చేయడానికి సాధ్యం కాదు. ప్రస్తుత నెలతోపాటు.. 2018లో జనవరి నుంచి జూన్ వరకూ ఆర్నెళ్ల అంటే మొత్తం ఏడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. కాఫర్ డ్యామ్ డిజైన్‌లే ఓ కొలిక్కిరాని నేపథ్యంలో 2018 నాటికి పనులెలా పూర్తవుతాయన్నది సర్కార్‌కే ఎరుక.