చంద్రబాబుపై మోదీ వ్యాఖ్యలే నిదర్శనం.. అందుకే రామోజీ వంకరరాతలు | Eenadu Ramoji Rao Fake News On Polavaram project works | Sakshi
Sakshi News home page

మోదీ వ్యాఖ్యలే నిదర్శనం.. చంద్రబాబుకు ‘వరం’ కాదని రామోజీ బాధ.. అందుకే ఈ వంకరరాతలు

Published Sun, Feb 19 2023 5:56 AM | Last Updated on Sun, Feb 19 2023 4:47 PM

Eenadu Ramoji Rao Fake News On Polavaram project works - Sakshi

2019 నవంబర్‌లో కాఫర్‌డ్యామ్‌లు ఇలా.. , 2023 ఫిబ్రవరిలో పూర్తయిన ఎగువ, దిగువ కాఫర్‌డ్యామ్‌లు

సాక్షి, అమరావతి: తన ఆత్మీయుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కుర్చీలో లేరనే అక్కసుతో ఒప్పును తప్పుగా చిత్రీకరించి ఉన్నది లేనట్లు కనికట్టు చేయడం తనకు మాత్రమే సాధ్యమైన పాత్రికేయమని రామోజీ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. తేలికగా చేయగలిగి.. అధికంగా వచ్చే లాభాలను కాంట్రాక్టర్‌తో కలిసి పంచుకుతినే పనులకే ప్రాధాన్యం ఇచ్చి, చంద్రబాబు.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు జీవాన్ని తీశారు.

పోలవరంను కమీషన్ల కోసం చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దుతూ ఇప్పుడు ప్రణాళికాయుతంగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తుంటే జీర్ణించుకోలేక ‘ఆ ఐదేళ్లలోనే పనులు భేష్‌’ శీర్షికతో శనివారం ‘ఈనాడు’లో రామోజీ వంకరరాతలు రాశారు.

ఆ రాతల్లో తమ దోపిడీకి అడ్డుకట్ట పడిందనే అక్కసు తప్ప మరొకటి కన్పించలేదు. అత్యధిక శాతం పనులు సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలోనే పూర్తయ్యాయనే వాస్తవాన్ని మరుగున పరిచి చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చాలనే తాపత్రయం రామోజీ కథనంలోని ప్రతి వాక్యంలోనూ కనిపించింది.

ఆరోపణ : ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం
వాస్తవం: గోదావరిపై ప్రధాన డ్యామ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌) నిర్మించడానికి వీలుగా.. వరద ప్రవాహాన్ని మళ్లించేలా అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఫైలట్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను తొలుత పూర్తి చేయాలి. ఈ పనులు పూర్తయ్యేలోగా 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి. కానీ.. చంద్రబాబు మాత్రం ఆ పనులేవీ చేయకుండానే.. కమీషన్ల కోసం తేలికగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే మట్టి తవ్వకం, స్పిల్‌ ఛానల్‌లో కాంక్రీట్‌ను కుప్పలా పోయడం వంటి పనులకే ప్రాధాన్యం ఇచ్చారు.

నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే ప్రధాన డ్యామ్‌ పునాది డయాఫ్రమ్‌ వాల్‌ను పూర్తి చేశారు. స్పిల్‌ వే పునాది స్థాయిలోనే వదిలేశారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లను పూర్తి చేయలేక.. వాటికి ఇరు వైపులా ఖాళీలు వదిలేసి, చేతులెత్తేశారు. దీంతో 2019 అక్టోబర్‌ 1న గోదా­వరికి దాదాపు 14 లక్షల క్యూసెక్కుల వరద (సీడబ్ల్యూసీ గేజ్‌ ప్రకారం) ఎగువ కాఫర్‌ డ్యామ్‌ ఖాళీ ప్రదేశాల గూండా ప్రవహించడం వల్ల దాదాపు 13 మీటర్‌/సెకను వేగంతో వరద ఉధృతి పెరగడంతో డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది.

ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసి, స్పీల్‌ వే మీదుగా వరద నీటిని మళ్లించి ఉంటే.. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినే పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. గోదావరి వరద ఉధృతి వల్ల ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–1 నిర్మాణ ప్రాంతంలో నదీ గర్భం +23 మీటర్ల నుంచి –12.00 మీటర్ల వరకు అంటే దాదాపు 35 మీటర్ల మందంతో కోతకు గురైంది.

గ్యాప్‌–2లో + 8 మీటర్ల నుంచి –12 మీటర్ల వరకు అంటే దాదాపు 20 మీటర్ల మందంతో, దిగువ కాఫర్‌ డ్యాం లో 36.5 మీటర్ల మందంతో గోదావరి గర్భం కోతకు గురైంది. స్పిల్‌ ఛానల్‌ లోని కాంక్రీటు బ్లాకులు (దిమ్మెలు) కొట్టుకుపోయాయి. వరద ఎగదన్నడంతో ముంపు గ్రామాలను గోదావరి వరద చుట్టుముట్టింది. నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీటన్నింటినీ సరిచేసేందుకే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగింది.

ఆరోపణ : బాబు హయాంలో చకచకా పనులు
వాస్తవం: రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును వంద శాతం వ్యయాన్ని భరించి.. అన్ని అనుమతులు తెచ్చి తామే పూర్తి చేస్తామని కేంద్రం పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చింది. ఆ మేరకు ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని 2014 మే 28న ఏర్పాటు చేసి.. ఆ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని నాటి టీడీపీ సర్కార్‌ను కోరుతూ వచ్చింది. ఒప్పందం చేసుకోకుండా కాలయాపన చేస్తూ.. పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని నాటి సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు.

ఈ క్రమంలో పార్లమెంట్‌ ద్వారా రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారు. దీంతో 2016 సెప్టెంబరు 7న అర్ధరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అప్పగించింది. ఈ క్రమంలోనే బడ్జెట్‌ ద్వారా కాకుండా నాబార్డు రుణాలతో పోలవరానికి నిధులు ఇస్తామని.. 2018 డిసెంబర్‌లోగా పూర్తి చేయకపోతే ఇచ్చిన నిధులను రుణంగా పరిగణిస్తామని కేంద్రం పెట్టిన షరతులకు అంగీకరిస్తూ 2016 డిసెంబర్‌ 26న సీఎంగా చంద్రబాబు సంతకం చేశారు.

ఆ తర్వాత 2016 డిసెంబర్‌ 30న పనులు ప్రారంభించారు. అంటే.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 2014 జూన్‌ 8 నుంచి 2016 డిసెంబర్‌ 30 వరకూ 31 నెలలపాటు పోలవరంలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఆ నాటి టీడీపీ ఎంపీ రాయపాటికి చెందిన సత్తా లేని ట్రాన్స్‌ట్రాయ్‌ని తప్పించాలని అనేక మార్లు కేంద్రం చెప్పినా పట్టించుకోలేదు. ఆ సంస్థనే అడ్డుపెట్టుకుని పోలవరం పనులన్నీ సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించి, తేలికగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యం ఇచ్చారు.

ఆరోపణ : మంత్రుల మాటలు కోటలు దాటాయి
వాస్తవం: చంద్రబాబు నిర్వాకం వల్ల అస్తవ్యస్తంగా మారిన పోలవరాన్ని గాడిలో పెడుతూ.. ఆనాటి తప్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధిగమిస్తూ ప్రణాళికా యుతంగా పోలవరాన్ని పూర్తి చేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే యాక్షన్‌ ప్లాన్‌ రచించి, అమలు చేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ... ఆర్థిక ఇబ్బందులను అధిగమించి.. 48 గేట్లతో సహా స్పిల్‌ వేను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు.

ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను, అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ ఛానల్‌ను పూర్తి చేసి.. 2021 జూలై 11న గోదావరి ప్రవాహాన్ని 6.1 కి.మీల పొడవున మళ్లించి చరిత్ర సృష్టించారు. చంద్రబాబు పాపాల వల్ల దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చే విధానాన్ని ఖరారు చేయడంపై డీడీఆర్పీ, సీడబ్ల్యూసీతో 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతూనే ఉంది.

2022 ఏప్రిల్‌లో విధానాన్ని ఖరారు చేయడంతో.. దాని ప్రకారం 2022 జూలై 9 నాటికే 20 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసింది. వరదలు తగ్గాక పనులు చేపట్టి ఈ నెల 15 నాటికి 31.5 మీటర్ల ఎత్తుతో దిగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తి చేసింది. గోదావరికి ఎంత పెద్ద వరద వచ్చినా నిశ్చితంగా ప్రధాన డ్యామ్‌ పనులను చేపట్టవచ్చు.

ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తయిన నేపథ్యంలో ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని పంపులతో తోడేస్తూ.. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చి, యథాస్థితికి తెచ్చే పనులను ముమ్మరం చేసింది. దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌ను ఎలా సరిచేయాలనే అంశంపై 15 నెలలుగా డీడీఆర్పీ, సీడబ్ల్యూసీ, ఐఐటీ(తిరుపతి, చెన్నై, ఢిల్లీ) ప్రొఫెసర్లు, ఎన్‌హెచ్‌పీసీతో రాష్ట్ర ప్రభుత్వం మేధోమధనం చేస్తోంది.

డయాఫ్రమ్‌ వాల్‌ భవితవ్యాన్ని తేల్చే పరీక్షలను ఇటీవల ఎన్‌హెచ్‌పీసీ పూర్తి చేసింది. ఆ సంస్థ నివేదిక ఇవ్వగానే డయాఫ్రమ్‌ వాల్‌పై ముందడుగు వేసి.. ప్రధాన డ్యామ్‌ను పూర్తి చేసే దిశగా చిత్తశుద్ధితో సీఎం వైఎస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినక పోయి ఉంటే.. 2021 నాటికే పోలవరం పూర్తయ్యేదని సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ అధికారవర్గాలే స్పష్టం చేశాయి. ఇవన్నీ నిజాలే కదా! మంత్రులు ఈ వాస్తవాలు చెప్పడం మాటలు కోటలు దాటడమా రామోజీ?  

నిర్వాసితులకు మేలు చేసిందెవరు?
నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనుల్లో కమీషన్లు రావనే నెపంతో వాటిని టీడీపీ సర్కార్‌ చేపట్టకుండా వారిని నట్టేట ముంచింది. ఐదేళ్లలో కేవలం రూ.484 కోట్లు ఖర్చు పెట్టి 3,110 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించింది. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

మూడేళ్ల­లోనే రూ.1,677 కోట్లు ఖర్చు పెట్టి 8,446 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. రానున్న రెండు మూడు నెలల్లో రూ.525 కోట్లతో మిగిలిన పున­రావాసం పనులు పూర్తి చేసి.. 9,390 కుటుంబాలకు పునరవాసం కల్పించనున్నారు. తద్వారా 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలోని నిర్వాసితులు అందరికీ పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement