రాజధాని భూ సేకరణపై చంద్రబాబు సమీక్ష
హైదరాబాద్ : రాజధాని భూ సేకరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం మంత్రలతో సమీక్ష నిర్వహించారు. బాబు నివాసంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. రాజధాని ప్రతిపాదిత గ్రామల రైతుల అభ్యంతరాలను మంత్రులు ఈ సందర్భంగా చంద్రబాబు ముందు ఉంచారు.
పంటను బట్టి పరిహారం ఇవ్వాలంటూ మంత్రులు ప్రతిపాదించారు. దేవాలయ భూములకూ పరిహారం ఇవ్వాలని మంత్రులు ప్రతిపాదన చేశారు. అలాగే పట్టాల్లేని భూములు సాగు చేస్తున్నవారికి కొంత పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే ఇళ్లు కోల్పోతున్నవారికి రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ల్యాండ్ పూలింగ్లో మార్పులు, చేర్పులపై నిర్ణయాలను చంద్రబాబు నాయుడు ప్రకటించనున్నారు.
మరోవైపు రేపటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు....రైతులతో సమావేశం కానున్నారు. ఈ నెల 11వ తేదీన మంత్రివర్గ ఉప సంఘం మరోసారి భేటీ కానుంది.