సీఎం వ్యాఖ్యలపై ఓరుగల్లులో ఆగ్రహ జ్వాల | CM comments on the flame of resentment orugallulo | Sakshi
Sakshi News home page

సీఎం వ్యాఖ్యలపై ఓరుగల్లులో ఆగ్రహ జ్వాల

Published Sat, Aug 10 2013 4:47 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

CM comments on the flame of resentment orugallulo

 వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఓరుగల్లు రగిలింది. జిల్లావ్యాప్తంగా తెలంగాణవాదులు నిరసన గళం వినిపించారు. సీఎం రాజీనామా చేయూలని, లేనిపక్షంలో కేంద్రం స్పందించి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. పలు సెంటర్లలో ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. కిరణ్... తెలంగాణ వ్యతిరేకిగా మారారని, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే కుట్రలను ఇప్పటికైనా మానుకోకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.  
 
 ఎక్కడెక్కడ.. ఎలా..
  కేయూ జేఏసీ ఆధ్వర్యంలో యూనివర్సిటీ రెండో గేటు వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం డౌన్, డౌన్ అనే నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. విద్యార్థుల నిరసనతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. 
 
  కేయూ జంక్షన్ వద్ద యువజన, ప్రజాసంఘా లు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశాయి. 
  హన్మకొండ అమరవీరుల స్థూపంవద్ద బీసీ జేఏసీ నాయకులు, న్యాయవాదులు, విద్యార్థులు వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 
 
  హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో టీఎస్ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. టీఆర్‌ఎస్ యూత్ విభాగం ఆధ్వర్యంలో హన్మకొండ చౌరస్తాలో వినూత్న నిరసన తెలిపారు. కిరణ్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి చెట్టుకు ఊరితీశారు.  
 
  వరంగల్ పోచమ్మమైదాన్ , కురవి, నర్సింహులపేట, పాలకుర్తి, దుగ్గొండి, నల్లబెల్లి, చెన్నారావుపేట, పరకాల, గీసుగొండ, బచ్చన్నపేట, నర్మెట, మద్దూరు మండల కేంద్రాల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మలను తెలంగాణవాదులు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనల్లో టీఆర్‌ఎస్ నాయకులు గుడిమల్ల రవికుమార్, బోడ డిన్నా, చాగంటి రమేష్, కిషన్, దామోదర్, లంక రాజగోపాల్, సైదిరెడ్డి, తిరునహరి శేషు, కేయూ జేఏసీ, టీజేఏసీ, బీసీ జేఏసీ, టీఎస్‌జేఏసీ, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
 
 మరో ఉద్యమానికి సిద్ధం
 తెలంగాణపై కుట్రలను ఆపకుంటే మరోసారి ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధం. ఇప్పటికైనా అన్నదమ్ముల్లా విడిపోయేందుకు సహకరించాలి. సీఎం లాంటివారు కుట్రలు చేస్తే సహించేదిలేదు. దీనికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులే బాధ్యత వహించాలి. మంత్రులు స్పందించి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలవాలి. ఇప్పటికే టీజేఏసీ ఈ అంశంపై  చర్చించింది. ఒకటి, రెండు రోజుల్లో ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశముంది. 
 - ప్రొఫెసర్ పాపిరెడ్డి, టీ జేఏసీ చైర్మన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement