
సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘటనపై సీఎం వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. అధికారులతో అనుచితంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని డీజీపీ గౌతం సవాంగ్‌కు స్పష్టం చేశారు. తప్పు చేసినట్లు తగిన ఆధారాలుంటే చట్ట ప్రకారం ఏ చర్యకైనా వెనుకాడవద్దని ఆదేశించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో భేటీ అయిన ముఖ్యమంత్రి రాత్రికి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం ఈ ఘటన వివరాలు డీజీపీ నుంచి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. చట్టం ఎదుట అందరూ సమానమేనని, చట్టం అమలు విషయంలో స్వేచ్ఛగా పని చేసుకోవాలని, ఈ అంశంలో ఎవరికీ మినహాయింపులు ఉండబోవని సీఎం హెచ్చరించారు.