హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైల్ చరిత్రలో మరొ చారిత్రక ఘట్టం ప్రారంభమైంది... ఇప్పటి వరకు రైలింగ్...పిల్లర్ల నిర్మాణంలోనే ఉన్న మెట్రోరైలు ఇపుడు కోచ్‌లతో సందర్శకులను అలరిస్తోంది. భాగ్యనగరి వాసుల కలల 'మెట్రో' కోచ్ను ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు.
నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి ఎదురుగా ఉన్న ప్రదేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోచ్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ప్రజల సందర్శనకు అనుమతి ఇచ్చారు. కొరియా నుంచి వచ్చిన మెట్రో రైలు కోచ్ను తిలకించేందుకు సందర్శకులు ఎంతో ఉత్సాహం చూపారు. మెట్రోరైల్ కోచ్ అచ్చంగా లగ్జరీ కారును తలపిస్తోందని వారు చెబుతున్నారు.
హైదరాబాద్ మెట్రో రైలు కోసం మొత్తం 57 రైళ్లకు కావల్సిన 171 బోగీలను ఆర్డర్ చేశారు. కొరియాకు చెందిన హుండయ్-రోట్టర్‌డామ్ కంపెనీ ఈ మెట్రోకోచ్‌ను హైదరాబాద్ మెట్రోరైలుకు అందించింది. వీటిలో మొదటిది అక్కడి ఫ్యాక్టరీ నుంచి చెన్నైకి, అక్కడినుంచి హైదరాబాద్కు చేరుకుంది. మెట్రోరైలు మొదటి దశ నాగోలు నుంచి మెట్టుగూడ వరకు (8 కిలోమీటర్ల మేరకు) 2015 మార్చిలో ఉగాది కానుకగా పట్టాలెక్కి నగరవాసులకు అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. ఆదిలో కొంత అవధులు వచ్చినా..అవి దాటుకుంటూ మెట్రోరైల్ పనులు చకచకాసాగుతున్నాయి.