జాబు హామీపై మాట తప్పిన బాబు
- ఏపీపీఎస్సీకి చైర్మన్‌ను నియమించాలి
- ఉద్యోగాలిస్తామన్న హామీ నిలబెట్టుకోవాలి
- కలెక్టరేట్ వద్ద నిరుద్యోగ ఫోరం ధర్నా
మహారాణిపేట(విశాఖ): జాబు కావాలంటే బాబు రావాలి అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని ఏపీ రాష్ట్ర నిరుద్యోగ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నిరుద్యోగుల ఫోరం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు లగుడు గోవిందరావు మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు తక్షణమే ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అమలు వంటి హామీలను నిలబెట్టుకోవాలన్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఇంతవరకు ఒక్క డీఎస్సీ తప్ప వేరే ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. రోడ్డుకు అడ్డంగా బైఠాయించి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు. చర్యలు తీసుకోకపోతే మంత్రుల ఇళ్లతోపాటు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ డి.వెంకటరెడ్డికి వినతి పత్రం అందచేశారు.