'అధికారంలో ఉన్నాం... తలచుకుంటే ఏమైనా చేస్తాం'
కడప: మా ప్రభుత్వం అధికారంలో ఉంది... మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేస్తానంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వైఎస్ఆర్ సీపీ నేతలను బెదిరించారు. శనివారం కడపలో జరిగిన జెడ్పీ సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ఎంపీ సీఎం రమేష్ జెడ్పీ సమావేశానికి ఎలా వస్తారంటూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాచమళ్లు ప్రసాద్ రెడ్డి ఉన్నతాధికారులను ప్రశ్నించారు. జడ్పీ సమావేశంలో ఉండటానికి సీఎం రమేష్ అనర్హుడంటూ మినిట్స్లో రూల్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే రూలింగ్ చేయడానికి జెడ్పీ చైర్మన్కు అధికారం లేదని జిల్లా కలెక్టర్... సీఎం రమేష్ను వెనకేసుకు వచ్చారు. దీంతో వైఎస్ఆర్ జడ్పీటీసీ సభ్యులు జెడ్పీ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఆ క్రమంలో సీఎం రమేష్ ఆగ్రహంతో ఊగిపోతూ పై విధంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులు ఏపీకి... అలాగే ఏపీకి చెందిన పలువురు ఎంపీలు తెలంగాణకు ఎంపికయ్యారు. సీఎం రమేష్ తెలంగాణకు కేటాయించారు. దీంతో తెలంగాణకు చెందిన ఎంపీ ఆంధ్రప్రదేశ్ జెడ్పీ సమావేశానికి ఎలా హజరవుతారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.