
సాక్షి, నెల్లూరు : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా హోంగార్డ్స్ దినసరి వేతనాలను పెంచుతూ జీఓ జారీ చేశారు. ఎన్నికల ప్రచార సభలో మీ సమస్యలను ‘నేను విన్నాను.. మీకు నేనున్నానంటూ’ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసు సిబ్బందికి భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వీక్లి ఆఫ్ అమలు చేయడంతో పాటు హోంగార్డులకు మెరుగైన వేతనాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇచ్చిన హామీల అమలు దిశగా చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జూన్‌లో వీక్లీ ఆఫ్‌ను అమల్లోకి తీసుకు వస్తూ జీఓ జారీ చేశారు. తాజాగా శనివారం హోంగార్డ్స్ దినసరి వేతనాన్ని రూ.600 నుంచి రూ.710కు పెంచుతూ జీఓ విడుదల చేశారు. ముఖ్యమంత్రి చర్యలతో హోంగార్డుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అందరూ ముక్త కంఠంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
జిల్లాలో 769 మంది హోంగార్డులు ఉన్నారు. వీరిలో 617 మంది పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తుండగా 157 మంది డిప్యుటేషన్‌పై ఆర్టీసీ, జైళ్లు, విజిలెన్స్, ట్రాన్స్‌కో, ఎఫ్‌సీఐ, ఏసీబీ, దూరదర్శన్, ఆర్టీఓ, అగ్నిమాపకశాఖ తదితర శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసు శాఖలో పని చేస్తున్న హోంగార్డులు పోలీసులతో సమానంగా సేవలందిస్తున్నారు. అయితే వీరికిచ్చే జీతం అంతంత మాత్రంగానే ఉండేది. గత ప్రభుత్వాలు వీరికి నామ మాత్రంగా వేతనాలు పెంచడంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. పెరిగిన జీతాలు సైతం కాలంలో అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. దీంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. పెరిగిన అవసరాలకు సరిపడా వేతనాలు పెంచాలని పలు దఫాలుగా గత ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండాపోయింది.
హామీని నెరవేర్చిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజాసంకల్పయాత్ర, ఎన్నికల ప్రచారంలో హోంగార్డులు తమ సమస్యలను అప్పటి రాష్ట్ర ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారి సాధక బాధలను విన్న ఆయన నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ముఖ్యమంత్రి శనివారం హోంగార్డుల దినసరి వేతనాన్ని రూ.710కు పెంచుతూ జీఓ జారీ చేశారు. పెరిగిన వేతనాలు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు నెలకు సగటున రూ.18,000 వేతనం హోంగార్డులకు వచ్చేది. తాజా పెంపుతో (30 రోజులకు) రూ. 21,300 రానుంది. వేతన పెంపుపై హోంగార్డుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
రుణపడి ఉంటాం
మా సాధక బాధలు విన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెరుగైన వేతనాలు అందిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వేతనాన్ని రూ.710కు పెంచుతూ జీఓ విడుదల చేసి మాటతప్పని మడమ తిప్పని నేతగా మరోసారి రుజువు చేశారు. హోంగార్డులందరూ ఆయనకు రుణపడి ఉన్నారు.
– పి. శరత్‌బాబు, హోంగార్డు
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
దినసరి వేతనాన్ని రూ.600 నుంచి రూ.710కు పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జీఓ విడుదల చేయడం హర్షణీయం. ముఖ్యమంత్రి చర్యలపై హోంగార్డులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు జిల్లా హోంగార్డుల తరఫున కృతజ్ఞతలు
– ఆర్ సునీల్‌కుమార్, హోంగార్డు
Comments
Please login to add a commentAdd a comment