సాక్షి, అమరావతి: కరోనా ప్రభావంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని తిరిగి పట్టాలకెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. 2014-15 నుంచి ఎంఎస్‌ఈలకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు ఇవ్వాలని నిర్ణయించింది. రూ.905 కోట్ల చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఎంఎస్‌ఎంఈలు సహా కీలక రంగాల్లోని పరిశ్రమలను ఆదుకునేందుకు తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి గురువారం కీలక సమీక్ష నిర్వహించారు. మంత్రి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్ జేఎన్వీ సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఎంఎస్‌ఎంఈలను కాపాడేందుకు పలు రకాల ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు. గత సమావేశంలో సీఎం ఇచ్చిన సూచనల మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలపై చర్చించిన తర్వాత నిర్ణయాలకు సీఎం ఆమోదం తెలిపారు.
(ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి మరో శాఖ అప్పగింత)
ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాల బకాయిలు చెల్లింపు:
2014–15 నుంచి పెండింగులో ఉన్న ఎంఎస్‌ఈల ప్రోత్సాహకాల బకాయిలను పూర్తిగా చెల్లించాలని సీఎం నిర్ణయించారు. మే నెలలో, జూన్ నెలలో చెల్లించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకూ గత ప్రభుత్వం హయాంలో ఎంఎస్‌ఈలకు ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వాల్సిన మొత్తం రూ.828 కోట్లు చెల్లించలేదన్న విషయంపై సమావేశంలో చర్చ జరిగింది. సంవత్సరాల వారీగా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాల రూపంలో బకాయిలు 2014–15లో రూ.43 కోట్లు, 2015–16లో రూ. 70 కోట్లు, 2016–17లో రూ.195 కోట్లు, 2017–18లో రూ. 207 కోట్లు, 2018–19లో రూ. 313 కోట్లు అప్పటివరకూ మొత్తం రూ. 828 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20లో ఎంఎస్‌ఈలకు బకాయిలు రూ.77 కోట్లు. మొత్తంగా రూ.905 కోట్లను మే, జూన్ నెలలో ఎంఎస్‌ఎంఈలకు ఇస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
ఎంఎస్‌ఎంఈల మినిమం కరెంటు డిమాండ్ ఛార్జీల రద్దు
ఏప్రిల్, మే, జూన్ నెలల కాలానికి ఎంఎస్‌ఎంఈల మినిమం విద్యుత్ డిమాండ్ ఛార్జీలను రద్దుచేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో దాదాపు రూ.188 కోట్ల మేర అన్ని ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి చేకూరనుంది. పై రెండు నిర్ణయాల కారణంగా 72,531 సూక్ష్మ పరిశ్రమలకూ, 24,252 చిన్న తరహా పరిశ్రమలకూ, 645 మధ్య పరిశ్రమలకూ మొత్తంగా 97, 428 ఎంఎస్‌ఎంఈలకు మేలు జరుగనుంది. ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈల తమ కార్యకలాపాలను పునరుద్ధరించుకోవడానికి వీలుగా, ఆర్థిక వనరుల సమీకరణలో తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇస్తూ సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకుని, రూ.200 కోట్లు సమకూర్చుకోవడం ద్వారా.. వాటిని వర్కింగ్ కేపిటల్‌గా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు అందించాలని నిర్ణయించారు. అతి తక్కువ వడ్డీకింద ఈ వర్కింగ్ కేపిటల్ సమకూర్చాలని సమావేశంలో నిర్ణయించారు.
ఆ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది..
టెక్స్‌టైల్ పరిశ్రమల సహా, భారీ, అతి భారీ పరిశ్రమలకు 3నెలల (ఏప్రిల్, మే, జూన్ నెలల) మినిమమం డిమాండ్ ఛార్జీల చెల్లింపును వాయిదా వేయాలని నిర్ణయించారు. ఎలాంటి అపరాధ రుసుము, అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. దీనివల్ల అన్ని పరిశ్రమలకూ అదనపు వర్కింగ్‌క్యాపిటల్ సమకూరుతుంది. టెక్స్‌టైల్ సహా ఇతర పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిలను చెల్లించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని సీఎం జగన్ ప్రకటించారు.
పరిశ్రమలను ఆదుకుంటాం..
కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా టెక్స్‌టైల్ సహా ఇతర పరిశ్రమలను ఆదుకోవడానికి ఆలోచనలు చేస్తోందని.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వెలువడిన తర్వాత మరోసారి సమీక్షచేసి టెక్స్‌టైల్ సహా ఇతర పరిశ్రమలనూ ఆదుకోవడానికి అన్నిచర్యలూ తీసుకుంటామని సీఎం జగన్ స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment