సాక్షి, అనంతపురం: డిసెంబర్ 1 నుంచి కొత్త ఆరోగ్య కార్డులు ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తం 2 వేల వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నామని వివరించారు. అదేవిధంగా నవంబర్ 1 నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఎంపిక చేసిన 150 ఆస్పత్రులలో వైద్యం చేయించుకునే నిరుపేదలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తామని ప్రకటించారు. గురువారం అనంతపురం జూనియర్ కాలేజీలో ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, స్థానిక ప్రజాపతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నేత్రదాన శిబిరం, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, పోషణ్ అభియాన్, పోషణ కార్యక్రమాలు, తల్లీబిడ్డల ఆరోగ్యం తదితర అంశాలకు సంబంధించిన స్టాళ్లను సందర్శించారు. అనంతరం కంటి వెలుగు లబ్ధిదారులతో మాట్లాడారు. గురువారం ఉదయమే అనంతకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేశారు. వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని ఆవిష్కరించిన ఆనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మేనిఫేస్టొలో చెప్పకపోయినా ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..
ప్రతి ఇంటిలో ఈ పథకం ద్వారా వెలుగులు నింపాలి
‘నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం. మన కళ్లు ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. అమ్మ అని పసిబిడ్డకు పరిచయం చేసేది కళ్లే. ఏపీలో 2.12 కోట్ల మందికి కంటి సమస్యలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకుంటే 80 శాతం సమస్య తీరుతుంది. కంటి సమస్య నిర్లక్ష్యం చేస్తే కంటిచూపు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ప్రజల కంటి సమస్యలపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మేనిఫేస్టోలో చెప్పకపోయినా ప్రజా ఆరోగ్యం దృష్ట్యా.. కంటి వెలుగు ప్రారంభించాం. రూ. 560 కోట్లతో పెద్ద ఎత్తున కంటివెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా ఉచిత చికిత్సతో పాటు, కళ్లద్దాలు కూడ ఇస్తాం. మూడేళ్ల కాలంలో ఆరు దశల్లో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి ఇంటిలో ఈ పథకం ద్వారా వెలుగులు నింపాలి. అక్టోబర్ 10 నుంచి 16 వరకు తొలి దశ కార్యక్రమంలో మొత్తం 70 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తాం.
పథకం గురించి అందరికీ చెప్పండి
కంటి పరీక్ష తర్వాత చికిత్స అవసరం అయితే నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు రెండో దశ స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్ శస్త్ర చికిత్సలు ఉచితం. ప్రజలు పైసా ఖర్చు లేకుండా కంటి వైద్యం చేయించుకోవచ్చు. మళ్లీ ఫిబ్రవరి 1 నుంచి 3,4,5,6 విడతల్లో కంటి పరీక్షలు నిర్వహిస్తాం. 3,4,5,6 దశల్లో కమ్యూనిటిబేస్ ఆధారంగా కంటి పరీక్షలు జరుగుతాయి. ఏపీలో ఉన్న 5.4 కోట్ల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తాం. వైఎస్సార్ కంటి పథకం గురించి అందరికీ చెప్పండి.
డయాలసిస్ పేషెంట్లకు రూ. 10 వేల పెన్షన్
త్వరలో 432 కొత్త 108 వాహనాలను ప్రారంభిస్తాం. అదేవిధంగా 676 కొత్త 104 వాహనాలు త్వరలో అందుబాటులోకి వస్తాయి. వెనకబడిన ప్రాంతాల్లో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. పలాస, మర్కాపురం ప్రాంతాల్లో కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తాం. డిసెంబర్‌లో ప్రజలందరికీ కొత్త ఆరోగ్యకార్డులు ఇస్తాం.
మొత్తం 2 వేల వ్యాధులను ఆరోగ్య శ్రీలో చేరుస్తాం. వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేస్తాం. జనవరి 1 నుంచి డయాలసిస్ పేషెంట్లకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తాం. నవంబర్ 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఎంపిక చేసిన 150 ఆస్పత్రులలో వైద్యం చేయించుకున్న నిరుపేదలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తాం. నేను అనంతపురం జిల్లా మనవడిని.. మా అమ్మ విజయమ్మ మీ జిల్లా ఆడపడుచు. మీ జిల్లా రూపురేఖలు మారుస్తానని హామీ ఇస్తున్నాను’అని సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment