అందరికీ కంటి వెలుగు | YS Jagan Mohan Reddy Launches Ysr Kanti Veelugu Scheme At Anantapuram | Sakshi
Sakshi News home page

అందరికీ కంటి వెలుగు

Published Fri, Oct 11 2019 4:03 AM | Last Updated on Fri, Oct 11 2019 8:08 AM

YS Jagan Mohan Reddy Launches Ysr Kanti Veelugu Scheme At Anantapuram - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలోని 5.4 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాల పంపిణీ, ఆపరేషన్లు కూడా చేయిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆరు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అనంతపురంలో గురువారం ఆయన డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో చెప్పకపోయినప్పటికీ డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు పథకాన్ని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద ప్రజలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే పూర్తి ఉచితంగా కంటి పరీక్షలతో పాటు అవసరమైన చికిత్సలు, కళ్ల జోళ్లను అందిస్తామన్నారు.రూ.560 కోట్లతో మూడేళ్ల పాటు చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిలో వెలుగులు నింపుతామని, ప్రతి కంటిలో వెలుగు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం అని వివరించారు.


ఒకటి.. రెండవ దశల్లో పిల్లలకు పరీక్షలు చేసి చికిత్స అందిస్తామని సీఎం తెలిపారు. అక్టోబర్‌ 10 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రంలోని 62,489 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 70,41,988 మంది పిల్లలకు కంటి పరీక్షలు చేస్తామన్నారు. ఇందుకోసం వలంటీర్లతో పాటు ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఉపాధ్యాయులు, ఎన్‌జీవోలు, ఇతర మెడికల్‌ సిబ్బంది సహకారం తీసుకుంటామని చెప్పారు. రెండవ దశలో నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు అవసరమైన వారికి మరిన్ని పరీక్షలు చేయడంతో పాటు కంటి చికిత్సలు చేయడం, కళ్ల జోళ్లను అందిస్తామని తెలిపారు. ఆ తర్వాత ఒక్కో దశ కార్యక్రమాన్ని 6 నెలల పాటు చేపట్టి..  మొత్తం కార్యక్రమాన్ని 31 జనవరి 2022 నాటికి పూర్తి చేస్తామన్నారు. పిల్లల తర్వాత అవ్వా, తాతలకు కంటి పరీక్షలు చేస్తామని, ఈ విధంగా రాష్ట్రంలోని 5.4 కోట్ల మందికి కంటి పరీక్షలు చేపట్టి, అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయిస్తామని వైఎస్‌ జగన్‌ వివరించారు.  

రోగులు కోలుకునే వరకు సాయం
తలసేమియా రోగులకు జనవరి నుంచి రూ.10 వేల పింఛన్‌ పథకాన్ని అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా పెరాలసిస్‌తో పాటు మరో 4 రకాల రోగాలతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా నెలకు రూ.5 వేల పింఛన్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. వీరికి కూడా జనవరి నెల నుంచి పింఛన్‌ ఇస్తామన్నారు. ఆరోగ్య శ్రీ కింద వివిధ రకాల ఆపరేషన్ల అనంతరం రోగులు కోలుకునే వరకు ఖర్చుల కింద రోజుకు రూ.225 చొప్పున లేదా ఎక్కువ రోజులైతే నెలకు రూ.5 వేలు సాయం డిసెంబర్‌ నుంచి అందించనున్నట్టు ఆయన ప్రకటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్తగా డిసెంబర్‌ నుంచి ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తామని స్పష్టం చేశారు.


ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు గత ప్రభుత్వం బకాయిపడిన రూ.650 కోట్లలో రూ.540 కోట్లు చెల్లించామన్నారు. రూ.1,000 బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తామని.. జనవరి 1వ తేదీ నుంచి పైలెట్‌ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లాలో 2 వేల వ్యాధులకు అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 1 నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాకు ఈ పథకం అమలును విస్తరిస్తామని చెప్పారు. నవంబర్‌ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో ఎంపిక చేసిన 150 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలును విస్తరిస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునికీకరణ
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసని, వాటిని పూర్తిగా మారుస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇందుకోసం జనవరి 2020 నుంచి జూన్‌ 2022 వరకు ఆధునికీకరణ, మరమ్మతు పనులను చేపట్టనున్నట్టు తెలిపారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎలా ఉంది? ప్రస్తుతం ఎలా ఉందనే వివరాలను ఫొటోలతో సహా ప్రజల ముందు ఉంచుతామని ప్రకటించారు.ప్రజల ఆరోగ్య డేటాను భద్రపరచి డేటా స్టోరేజీ ఫెసిలిటీని అందుబాటులో ఉంచడం ద్వారా ఏ ఆసుపత్రికి వెళ్లినా సదరు రోగి పాత రికార్డు కూడా డాక్టర్లు సులువుగా తెలుసుకుని వైద్యం అందించేందుకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. కిడ్నీ రోగుల కోసం ప్రత్యేకంగా కిడ్నీ రిసెర్చ్‌ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు పలాస వంటి ప్రాంతాలకు మంచినీటి సరఫరా పథకాన్ని అమలు చేస్తామన్నారు. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 6 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.


మార్చి నాటికి కొత్త 108, 104 వాహనాలు
గత ప్రభుత్వం 108 వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని, ఫోన్‌ చేస్తే కుయ్‌..కుయ్‌ అంటూ 20 నిమిషాల్లో రావాల్సిన వాహనం రావడం లేదని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి మండలానికి ఒక్కో 108, 104 వాహనాన్ని సమకూర్చేందుకు 432.. 108 వాహనాలు, 676.. 104 వాహనాలు మొత్తం 1,108 వాహనాల కోసం టెండర్లు పిలిచామన్నారు. మార్చి నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని జగన్‌ హామీ ఇచ్చారు. మార్కాపురం, పిడుగురాళ్ల, ఏలూరు, పులివెందులలో మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తామని.. ఇప్పటికే ఏలూరులో మెడికల్‌ కాలేజీ భవనానికి శంకుస్థాపన కూడా చేశామన్నారు.

కాగా, అంతకు ముందు సీఎం వైఎస్‌ జగన్‌ పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నేత్రదాన శిబిరం, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, పోషణ్‌ అభియాన్, తల్లీబిడ్డల ఆరోగ్యం తదితర అంశాలకు సంబంధించిన స్టాళ్లను సందర్శించారు. కంటి వెలుగు లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆళ్లనాని, శంకర్‌నారాయణ, కలెక్టర్‌ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

మన కళ్లు మనకు ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. పుట్టగానే అమ్మ ఎలా ఉంటుందనేది పరిచయం చేసేది మన కళ్లే. అటువంటి కళ్లకు సంబంధించి ఈ రోజు మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటంటే.. 5.40 కోట్ల జనాభాలో ఏకంగా 2.12 కోట్ల మందికి చూపుపరంగా సమస్యలు ఉన్నాయి. మనం కొంచెం శ్రద్ధ పెడితే దాదాపు 80 శాతం సమస్యలు పూర్తిగా నయమవుతాయి. అందుకే రూ.560 కోట్లతో ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ ప్రారంభించాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

►అనంతపురం జిల్లాకు నేను మనవడిని. అమ్మ విజయమ్మ ఇక్కడి ఆడపడుచు. ఈ జిల్లాకు మనవడిగా అన్ని విధాలా అభివృద్ధి చేసి, రూపురేఖలు మారుస్తాను. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 2,200 క్యూసెక్కుల నుంచి 6 వేల క్యూసెక్కులకు పెంచడంతో పాటు 4 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో సమాంతర కాలువ నిర్మిస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement