
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంచలన నిర్ణయానికి వేదికగా మారింది. రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలన్న తీర్మానం శాసనసభ ముందుకొచ్చింది. సోమవారం శాసనసభ సమావేశం ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండలిని రద్దు చేసే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన తీర్మానంపై సభ చర్చ చేపట్టింది. (ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం)
మండలి రద్దు తీర్మానంపై డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చర్చను ఆరంభించారు. ఏపీ శాసన మండలి రద్దు తీర్మానానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిని తరలించడం లేదని, మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో భూముల కొనుక్కున్న టీడీపీ నేతలే కావాలని రచ్చ చేస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను నివారించేందుకే మూడు రాజధానులు అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే అని స్పష్టం చేశారు.
అంతకుముందు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం శాసన మండలిని రద్దు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. మంత్రివర్గం నిర్ణయానికి ఆమోదముద్ర వేసిన అనంతరం శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభా వ్యవహారాల కమిటీ (బీఏసీ)ని సమావేశపరిచారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష టీడీపీ నాయకులు హాజరుకాలేదు. బీఏసీ నిర్ణయం మేరకు శాసనసభ ప్రారంభం కాగానే మండలిని రద్దు చేయాలన్న తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పలు బిల్లులతో పాటు వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు వంటి కీలకమైన బిల్లులను మండలి తిరిస్కరించిన విషయం తెలిసిందే.
(‘సీఎం జగన్ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం’)
Comments
Please login to add a commentAdd a comment