
నూతన గవర్నర్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
సాక్షి, అమరావతి : ఒడిశాకు చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత విశ్వభూషణ్ హరిచందన్‌ను ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. నూతన గవర్నర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి సంపూర్ణ, సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరారు. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లు దాటినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా నియమితులైన ఈఎస్‌ఎల్ నరసింహన్ ఇప్పటివరకు నూతన ఆంధ్రప్రదేశ్‌కు కూడా గవర్నర్‌గా కొనసాగుతూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా హరిచందన్ నియమితులైనందున నరసింహన్ ఇక తెలంగాణకు మాత్రమే గవర్నర్‌గా కొనసాగుతారు.
ఏపీ గవర్నర్‌కు నరసింహన్ ఫోన్..
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్‌కు తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి హరిచందన్ కృషి చేస్తారని ఆశించారు.