
సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్టు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్ జగన్, చిత్రంలో పెద్దిరెడ్డి, బొత్స తదితరులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ప్రజల మధ్యే చర్చ జరిపేందుకు ఇక గ్రామాల్లో ప్రతి ఏటా తప్పనిసరిగా 8 విడతలుగా గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ సచివాలయ విధులు, సచివాలయ ఉద్యోగులు బాధ్యతలను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్టు పుస్తకాన్ని బుధవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. దశల వారీగా మద్య నియంత్రణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ కొత్త మద్యం పాలసీ అమలు కోసం సంబంధిత శాఖతో సచివాలయ ఉద్యోగులు కలిసి పని చేయనున్నారు. బాల కార్మికుల నియంత్రణ చట్టం, కుటుంబ వేధింపుల చట్టం, బాల్య వివాహాలు నిషేధ చట్టం, వాల్టా చట్టం వంటివి కూడా సంబంధిత శాఖ సహకారంతో గ్రామ పరిధిలో పటిష్టంగా అమలు చేయడంలో సచివాలయ ఉద్యోగులను భాగస్వాములను చేయనున్నారు. సచివాలయం మొత్తం చేపట్టాల్సిన విధులతో పాటు అందులో పనిచేసే ఒక్కో రకమైన ఉద్యోగికి ఒక్కో రకం జాబ్ చార్టును విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment