సాక్షి, అమరావతి: డయాలసిస్ లాంటి చికిత్సలు అవసరమైన వారికి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై ఆయన సమీక్ష జరిపారు. మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. కోవిడ్ ఆసుపత్రులుగా కొన్నింటిని ప్రకటించినందున అక్కడ అందించే సేవలను వేరే ఆసుపత్రులకు తరలించామని ముఖ్యమంత్రికి అధికారులు వివరణ ఇచ్చారు. ఎమర్జెన్సీ సేవలు అవసరమైన వారికి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అధికారులు తెలిపారు. కర్నూలు, గుంటూరులో వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై చర్చ జరిగింది. ఈ రెండు నగరాల్లో అన్ని ప్రాంతాలకూ వైరస్ వ్యాప్తి చెందలేదని.. ఒకటి, రెండు ప్రాంతాలకే పరిమితమయ్యిందని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
(జులై 8న 27 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు)
సీఎం మార్గనిర్దేశనం..
కరోనా వైరస్ కట్టడికి సూక్ష్మస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశనం చేశారు. ఈ ప్రాంతాల్లోని ప్రతి వీధి చివర్లో నిత్యావసరాలు ఉంచడం ద్వారా కంటైన్మెంట్ పటిష్టంగా అమలు చేసేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. కుటుంబంలో ఒకరికి పాసు ఇచ్చి.. నిత్యావసరాలకు ఆ వ్యక్తిని మాత్రమే అందుబాటులో ఉన్న దుకాణం వద్దకు వెళ్లేలా చూడాలని సీఎం సూచించారు. కేసుల తీవ్రత అధికంగా ఉన్న నంద్యాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వైద్యం కోసం టెలీ మెడిసిన్‌ను సంప్రదిస్తున్నవారి సంఖ్య బాగా పెరిగిందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఇప్పటి వరకు 8,395 మంది టెలీ మెడిసిన్ ద్వారా వైద్యులను సంప్రదించారని అధికారులు పేర్కొన్నారు. మరింత సమర్థవంతంగా అమలు చేయలని సీఎం సూచించారు.
(కరోనా పరీక్షల్లో ఏపీ రికార్డ్)
వాటిపై దృష్టి పెట్టాలి..
డీఆర్డీవో ద్వారా మొబైల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సీఎం తెలిపారు. వలస కూలీలు, వివిధ క్యాంపుల్లో ఉన్న వారిని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. టమోటా, ఉల్లి, చీనీ పంటలు సహా ఇతర ఉత్పత్తులను మార్కెటింగ్,ధరలపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. రైతు బజార్లను ఎక్కువగా వికేంద్రీకరించి రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను ఈ రైతు బజార్లలో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment