వాటికి మందులు ఎక్కడా లేవు: సీఎం జగన్‌ | CM YS Jagan Speech In YSR Kanti Velugu Third Phase Launch Kurnool | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుస్తాం: సీఎం జగన్‌

Published Tue, Feb 18 2020 1:36 PM | Last Updated on Tue, Feb 18 2020 5:07 PM

CM YS Jagan Speech In YSR Kanti Velugu Third Phase Launch Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు: కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవసరమైన చోట జాతీయ స్థాయి ప్రమాణాలతో కొత్త ఆస్పత్రులు నిర్మిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న ఆస్పత్రుల దగ్గర నుంచి బోధనాసుపత్రుల వరకు అన్ని ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని తెలిపారు. రాష్ట్రంలో 60 ఏళ్లు, ఆ పై వయసున్న 56,88,420 మంది వృద్ధులకు వారు ఉంటున్న గ్రామ, వార్డుల్లోనే వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం అందించే దిశగా చేపట్టిన మూడో విడత కార్యక్రమాన్ని సీఎం జగన్‌ మంగళవారం కర్నూలులో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవ్వాతాతలకు ఎంత చేసినా తక్కువేనన్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 56 లక్షల 88 వేల 420 మంది అవ్వాతాతలకు గ్రామ సచివాలయాల్లోనే కంటి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. మార్చి 1 నుంచి అవ్వాతాతలకు కంటి ఆపరేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. 133 కేంద్రాల్లో కంటి శస్త్ర చికిత్సకై ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామ వాలంటీర్లు అవ్వాతాతల ఇంటికి కళ్లజోళ్లు అందజేస్తారని తెలిపారు.

ఇక రూ. 15,337 కోట్లతో ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ‘‘మొదటి దశలో రూ. 1129 కోట్లతో నాడు-నేడు. రెండో దశలో పీహెచ్‌సీ, కమ్యూనిటీ సెంటర్లలో నాడు-నేడు. రూ. 700 కోట్లతో ఏరియా ఆస్పత్రుల ఆధునికీకరణ. రాష్ట్రంలో కేవలం 11 బోధనాసుపత్రులు మాత్రమే ఉన్నాయి. మరో 16 టీచింగ్‌ ఆస్పత్రులు తీసుకువస్తాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి మెడికల్‌ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటాం. నర్సింగ్‌ కాలేజీలు కూడా పెంచుతాం. పేదవాడికి వైద్యం అందించడానికి డాక్టర్‌ లేడు అన్న పదం వినపడకూడదు. ఆ దిశగా చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.

కడుపు మంటకు ఎక్కడా చికిత్స లేదు
రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గానికి ఏ ప్రభుత్వమూ చేయని విధంగా తమ ప్రభుత్వం మేలు చేస్తుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఇంతమంచి పాలన చేస్తుంటే.. చూసి ఓర్చుకోని వారి సంఖ్య సాధారణంగా ఎక్కువగానే ఉంటుందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నాయకులు కడుపు మంటతో ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారన్నారు. ‘‘ఆరోగ్యశ్రీలో 2వేల వ్యాధులకు పైగా చికిత్స చేస్తున్నాం. ఇంకా క్యాన్సర్‌కు కూడా ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం ఉంది. కానీ, అసూయతో కూడిన కడుపు మంటకు ఎక్కడా చికిత్స లేదు. కంటిచూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది కానీ, చెడు దృష్టికి మాత్రం ఎక్కడా కూడా చికిత్స లేనే లేదు. వయసు మళ్లితే చికిత్సలు ఉన్నాయి కానీ, మెదడు కుళ్లితే మాత్రం చికిత్స లేనే లేదు. అలాంటి లక్షణాలున్న మనుషులను మహానుభావులుగా చూపించే కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్లు ఉన్నాయి. వాటిని బాగు చేసే మందులు కూడా ఎక్కడా లేవు’’ అని చంద్రబాబు, ఎల్లోమీడియా తీరుపై వ్యంగ్యస్త్రాలు సంధించారు.

‘‘వీటన్నింటి మధ్య కూడా మీ బిడ్డ మీ కోసం పని చేస్తున్నాడు. నిజాయితీతో పని చేస్తున్నాడు. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తున్నాం. ప్రతి కుటుంబం, అందులో పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలా చదువులు చెప్పిస్తున్నాం. వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం మీద దృష్టి పెట్టాం. మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో మొదటి ఏడాది కూడా పూర్తి కాకుండానే 85 శాతానికి పైగా అమలు చేసే చర్యలు తీసుకున్నాం. ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌ (ఐపీహెచ్‌ఎస్‌)కు అనుగుణంగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏఎహెచ్‌లు, డీహెచ్‌లతో పాటు, టీచింగ్‌ ఆస్పత్రులను కూడా మార్చబోతున్నాం’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి:

‘సీఎం జగన్‌ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు’

‘సీఎం జగన్‌ మా ఆశలను చిగురింపజేశారు’
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement