అవ్వాతాతల కంటికి వెలుగు | CM YS Jagan Mohan Reddy Comments In YSR Kanti Velugu Third Phase Launch | Sakshi
Sakshi News home page

అవ్వాతాతల కంటికి వెలుగు

Published Wed, Feb 19 2020 4:14 AM | Last Updated on Wed, Feb 19 2020 9:21 AM

CM YS Jagan Mohan Reddy Comments In YSR Kanti Velugu Third Phase Launch - Sakshi

కర్నూలులో జరిగిన సభలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అవ్వాతాతలకు ఉచితంగా కంటి వైద్యం అందిస్తాం. అవ్వాతాతలకు ఎంత చేసినా తక్కువే అని భావించే వారిలో నేను మొదటి వాడిని. వారికి సేవ చేయడం దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నా.

56,88,420 మంది అవ్వాతాతలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయిస్తున్నాం. కంటి పరీక్షలు చేసిన వారికి 2 వారాల లోపు నేరుగా వలంటీర్ల ద్వారా ఇళ్ల వద్దకే వచ్చి కళ్లజోళ్లు పంపిణీ చేస్తాం. మార్చి 1 నుంచి ఆపరేషన్లు, ఇతర వైద్య చికిత్సలు చేయిస్తాం. 
 
సబ్‌ సెంటర్‌ నుంచి పీహెచ్‌సీ, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి, భోదనాసుపత్రి వరకూ ఇప్పుడు అన్నింటి ఫొటోలు తీసి, మూడేళ్లలో మార్పు చేసి మళ్లీ ఫొటోలు తీసి అందరికీ చూపిస్తాం. అందుకు ఏకంగా రూ.15,337 కోట్లతో పనులు చేయబోతున్నాం.  
 
మంచి పాలన సాగిస్తుంటే ఓర్వలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీలో 2 వేల వ్యాధులకు చికిత్స ఉంది. కేన్సర్‌ వచ్చినా చికిత్స ఉంది. కానీ అసూయతో వచ్చే కడుపు మంటకు ఎక్కడా చికిత్స లేదు. కంటి చూపు మందగిస్తే కంటి వెలుగు ద్వారా చికిత్స చేయొచ్చు. చెడు చూపునకు ఎక్కడా చికిత్స లేదు. వయసు మళ్లితే చికిత్స ఉంది కానీ.. మెదడు కుళ్లితే చికిత్స లేదు.  
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, కర్నూలు: అవ్వాతాతలకు వయసు మీద పడిన తర్వాత దృష్టి లోపం లేకుండా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, చికిత్స చేయించే వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పెద్ద వయసులో కంటి చూపు మందగిస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయో అందరికీ తెలుసని, ఈ పరిస్థితిని మార్చబోతున్నామని చెప్పారు. కర్నూలులోని ఎస్టీబీసీ కళాశాలలో మంగళవారం ఆయన మూడో విడత వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తనకెంతో ఇష్టమైన అవ్వాతాతల కోసం ఈ కార్యక్రమాన్ని  ప్రారంభిస్తున్నామన్నారు. ఈ రోజు నుంచి జూలై ఆఖరు వరకు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. 56,88,420 మంది అవ్వాతాతలకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉచితంగా కంటి వైద్య సేవలు ప్రారంభమవుతున్నాయన్నారు. ఈ సభలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..   
 
ఆపరేషన్ల కోసం 133 కేంద్రాలు 
‘మార్చి 1వ తేదీ నుంచి కంటి ఆపరేషన్లు ప్రారంభమవుతాయి. ఆపరేషన్ల కోసం 133 కేంద్రాలు సిద్ధం చేశాం. జిల్లా కేంద్రాల్లోని 11 బోధనాసుపత్రులు, 13 జిల్లా ఆస్పత్రులు, 28 ఏరియా ఆస్పత్రులు, 81 ఎన్‌జీవో పరిధిలోని ఆస్పత్రుల్లో వైద్యం చేయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగులతో పాటు పీహెచ్‌సీ వైద్యలు, సిబ్బంది, ఆశా వర్కర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దీని కోసం రూ.560 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మొదటి దశగా 2019 అక్టోబర్‌ 10న కంటి వెలుగు ప్రారంభమైంది. స్కూళ్లకు వెళ్లే చిన్నారుల కోసం మొదలుపెట్టాం. ఏకంగా 66 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాం. 60 వేల మంది సిబ్బంది పాల్గొని ఒక మహాయజ్ఞంగా చేశారు. నవంబర్‌ 1 నుంచి 31 వరకూ రెండోదశ పూర్తి చేశారు. 500 మంది నిపుణులైన బృందాలతో 4.36 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. అందులో 1.50 లక్షల మందికి కళ్లజోళ్లు ఇచ్చాం. 46 వేల మందికి ఈ వేసవిలో పదో తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు శస్త్ర చికిత్సలు చేయిస్తాం.  
కంటి పరీక్ష చేయించుకుంటున్న అవ్వను పలకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
 
ఐపీహెచ్‌ స్టాండర్డ్స్‌ తీసుకొస్తాం 
ఆటో, లాయర్‌ అన్నదమ్ముల నుంచి చేనేత అక్కచెల్లెమ్మలు, మత్స్యకారులు, అగ్రిగోల్డ్‌ బాధితుల వరకు.. మీ బిడ్డగా చేతనైన సాయం చేశానని గర్వంగా చెబుతున్నా. ఈ రోజు మరో అడుగు ముందుకేసి మరో రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఆసుపత్రుల రూపురేఖలు మార్చే కార్యక్రమం ఒకటైతే.. వైఎస్సార్‌ కంటి వెలుగు మరొకటి. ఈ రోజు నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో మార్చేందుకు ‘నాడు–నేడు’కు శ్రీకారం చుడుతున్నాం. జాతీయ స్థాయి ప్రమాణాలు నెలకొల్పుతాం. మొదటగా కర్నూలు జిల్లా నుంచే  ప్రారంభిస్తున్నాం. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని ఐపీహెచ్‌ఎస్‌ (ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌) స్థాయికి తీసుకొస్తాం. గ్రామాల్లోని ఆసుపత్రుల నుంచి బోధనాసుపత్రుల వరకు అన్నింటినీ మూడు దశల్లో మూడేళ్లలో పూర్తిగా మారుస్తాం. మొదటి దశలో 7,458 సబ్‌సెంటర్లలో ‘నాడు–నేడు’కు శ్రీకారం చుట్టాం. 4,906 కొత్త భవనాలు నిర్మిస్తున్నాం. కొత్త శాశ్వత ఆస్పత్రులు తీసుకొస్తున్నాం. మిగిలిన 2,552 సబ్‌సెంటర్ల రూపురేఖలు కూడా మారుస్తాం. వీటన్నిటికీ రూ.11,029 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పేందుకు గర్వపడుతున్నా. 
కర్నూలులో బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన జనసందోహం 
 
52 ఏరియా ఆసుపత్రుల ఆధునికీకరణ 

రెండో దశలో 1,445 పీహెచ్‌సీ, 149 కొత్త ఆసుపత్రులు నిర్మిస్తున్నాం. మిగిలిన 989 ఆసుపత్రులకు మరమ్మతులు చేసి అత్యాధునికంగా మార్చబోతున్నాం. రెండో దశలోనే 169 కమ్యూనిటీ సెంటర్ల రూపురేఖలు కూడా మారుస్తున్నాం. ఇవికాక 52 ఏరియా ఆస్పత్రులను ఆధునికీకరిస్తున్నాం. వీటన్నిటికీ రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. సీహెచ్‌సీల కోసం రూ.1,212 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మూడు దశల్లో జిల్లా ఆసుత్రులు, భోదనాసుపత్రులను బలోపేతం చేస్తాం. కొత్తగా మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. వీటికి రూ.12,300 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మొత్తంగా వైద్య రంగ అభివృద్ధికి రూ.15,303 కోట్లు ఖర్చు పెడుతున్నందుకు గర్వపడుతున్నా. 
‘డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ’ హెల్త్‌కార్డు (నమూనా)ను ఆవిష్కరిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు 
‘నాడు–నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్న విధంగా, ఇదే కార్యక్రమం ద్వారా ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చేందుకు శ్రీకారం చుట్టాం. కార్పొరేట్‌ స్థాయి ప్రమాణాలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. వీటిని పూర్తిగా ఆధునికీకరించడమే కాకుండా మూడేళ్లలో మూడు దశల్లో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్‌ కాలేజీ (బోధనాసుపత్రి) ఉండేలా చూస్తాం.

ఇప్పుడున్న 11 మెడికల్‌ కాలేజీలకు అదనంగా 16 కొత్త కాలేజీలు కలిపి మొత్తం 27 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. వీటితో పాటు నర్సింగ్‌ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకుంటాం. దీంతో ప్రతి ఆసుపత్రిలో పీజీ కోర్సులు వస్తాయి. పూర్తి స్థాయిలో డాక్టర్లు అందుబాటులో ఉంటారు. పీజీ చేసే డాక్టర్లు, ఎంబీబీఎస్‌ విద్యార్థులు, నర్సులు కూడా అందుబాటులో ఉంటారు. పేదవాడు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే డాక్టర్లు లేరనే మాటే రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. 11 బోధనాసుపత్రులు, 6 అనుబంధ ఆసుపత్రులు, 8 సూపర్‌ స్పెషాలిటీ, 3 కేన్సర్‌ ఆసుపత్రులు, 16 కొత్త నర్సింగ్‌ కాలేజీలు స్థాపించి వైద్య రంగం రూపురేఖలు మార్చబోతున్నాం. పేదలకు ఉచిత వైద్యం అందించేందుకు దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయని విధంగా మనం ఖర్చు చేస్తున్నామని చెప్పేందుకు గర్వంగా ఉంది.    
మంచి పనులు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు 
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి, ప్రతి సామాజిక వర్గానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా దేవుని ఆశీస్సులతో మంచి చేస్తున్నాం. మంచి పరిపాలన చేస్తున్నపుడు సహజంగా ఓర్చుకోలేని వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. చంద్రబాబు మాటలు విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. ఆయనకు ఎంతటి కడుపు మంట ఉంటుందో అందరూ అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి మనుషుల్ని మహానుభావులుగా చూపించే కొన్ని చానెళ్లు, పత్రికలు ఉన్నాయి. వీరిని బాగుచేసే మందులు ఎక్కడా లేవు. వీటన్నింటి మధ్య మీ బిడ్డ మీ కోసం పని చేస్తున్నాడు. నిజాయితీతో పని చేస్తున్నాం.

ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తున్నాం. వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయంపై దృష్టి పెడుతున్నాం. మేనిఫెస్టోలోని వాగ్దానాలను ఏడాదిలోపే 85 శాతం అమలు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. ప్రజల ఆనందం, భవిష్యత్తు కోసం పని చేస్తున్నాం. అవ్వాతాతల దీవెనలు, అక్కాచెల్లెమ్మల చల్లని దీవెనలు మీ బిడ్డకు ఉండాలని కోరుతున్నా’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. సభకు ముందు వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా సీఎం దగ్గరుండి.. వృద్ధులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌లు చేయించారు. విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. స్మార్ట్‌ హెల్త్‌ కార్డులు పంపిణీ చేశారు. మోడల్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ నిర్మాణానికి శిలాఫలం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, ఆళ్లనాని, గుమ్మనూరు జయరాం, ఎంపీలు సంజీవ్‌కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్, మండలి విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  

న్యాయ రాజధానిలో సీఎంకు ఘన స్వాగతం 
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కర్నూలుకు తొలిసారి రావడం, అందులో కర్నూలును ‘న్యాయ రాజధాని’గా ప్రకటించి ఉండటంతో కర్నూలు వాసులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు మరిచిపోలేని విధంగా స్వాగతం పలికారు. ఎస్‌ఏపీ క్యాంపులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి ఎస్టీబీసీ కళాశాలలో సభా వేదిక వరకు దాదాపు 25 వేల మంది మానవహారంగా నిల్చొని స్వాగతం పలికారు. ‘థ్యాంక్యూ సీఎం’ అనే ప్ల కార్డులను చేతబట్టి ‘జై జగన్‌.. జైజై జగన్‌’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు తప్పెట్లు, మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. కర్నూలు చరిత్రలో ఏ ముఖ్యమంత్రికీ ఈ స్థాయిలో స్వాగతం లభించి ఉండదని స్థానికులు చర్చించుకున్నారు. బహిరంగ సభలోనూ ‘థ్యాంక్యూ సీఎం’ అన్న ప్లకార్డులు పెద్దఎత్తున ప్రదర్శించారు.  

మామయ్యా.. మళ్లీ మళ్లీ మీరే రావాలి
బాలిక ప్రసంగానికి ముగ్దుడైన సీఎం
‘ఒక అమ్మలా ఆలోచించి మంచి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. ఒక నాన్నలా ఆలోచించి బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు. ఒక అన్నలా ఆలోచించి ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారు. ఇంత మంచి సీఎం మామయ్య ఉండగా మనకు ఇంకేమి కావాలి? చెప్పండి. మళ్లీ మళ్లీ ఇలాంటి సీఎం మామయ్య రావాలి. నేను డాక్టరై మీ పరిపాలనలో సేవ చేయాలని ఉంది మామయ్యా..’ అంటూ కర్నూలు జిల్లా మిడుతూరు కస్తూర్బా పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న జ్యోతిర్మయి చేసిన ప్రసంగానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముగ్దుడయ్యారు. ప్రసంగం ముగియగానే ఆ బాలికను ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగిన సీఎం సభలో జ్యోతిర్మయి ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది.
జ్యోతిర్మయిని అభినందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

‘జగన్‌ మామయ్య చెప్పిన విధంగానే నవరత్నాల అమలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అమ్మ ఒడి, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, వైఎస్సార్‌ ఆసరా, పేదలందరికీ ఇళ్లు, పెన్షన్ల పెంపు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. విద్యకు సంబంధించి చాలా పథకాలను ప్రవేశపెట్టారు. నేను డాక్టరై పేదలకు ఉచిత వైద్యం అందించాలనుకుంటున్నా. కానీ, మా ఇంట్లో ఇంత పెద్ద చదువులు చదివించడానికి స్తోమత లేదు. కానీ ఇప్పుడు నాకు ఆ భయం లేదు. అమ్మఒడి, నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం, పౌష్టికాహారం, కంటి వెలుగు తదితర పథకాలు, కార్యక్రమాలతో పేద విద్యార్థులందరూ చదువుపట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇన్ని గొప్ప పనులు చేసినందుకు సీఎం మామయ్యకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని జ్యోతిర్మయి వివరించడంతో సభకు హాజరైన వారందరూ చప్పట్లతో అభినందించారు. 

సీఎంకు ఘన స్వాగతం 
సీఎంగా బాధ్యతలు చేపట్టాక కర్నూలుకు తొలిసారి రావడం, అందులో కర్నూలును ‘న్యాయ రాజధాని’గా ప్రకటించి ఉండటంతో కర్నూలు వాసులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు మరిచిపోలేని విధంగా స్వాగతం పలికారు. ఎస్‌ఏపీ క్యాంపులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి ఎస్టీబీసీ కళాశాలలో సభా వేదిక వరకు దాదాపు 25 వేల మంది మానవహారంగా నిల్చొని స్వాగతం పలికారు. ‘థ్యాంక్యూ సీఎం’ అనే ప్లకార్డులను చేతబట్టి ‘జై జగన్‌.. జైజై జగన్‌’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు తప్పెట్లు, మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. కర్నూలు చరిత్రలో ఏ సీఎంకు ఈ స్థాయిలో స్వాగతం లభించి ఉండదని స్థానికులు చర్చించుకున్నారు. సభలోనూ ‘థ్యాంక్యూ సీఎం’ అన్న ప్లకార్డులు పెద్దఎత్తున ప్రదర్శించారు.

సీఎంకు స్వాగతం పలుకుతున్న కర్నూలు ప్రజలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement