మాస్క్‌లు ఎక్కడిపడితే అక్కడ పడేస్తే ప్రమాదకరం.. | CM YS Jagan Video Conference With District Collectors On Coronavirus Prevention | Sakshi
Sakshi News home page

సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం అవసరం: సీఎం జగన్‌

Published Fri, Mar 20 2020 1:37 PM | Last Updated on Fri, Mar 20 2020 6:16 PM

CM YS Jagan Video Conference With District Collectors On Coronavirus Prevention - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజల్లో అపోహలను తొలగించి.. అవగాహన పెంచాలని అధికారులకు ఆయన సూచించారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలు, ఇళ్ల పట్టాల పంపిణీపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాపై తప్పుడు సమాచారం వ్యాపింప చేసి ప్రజలను ఆందోళనకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దుకాణాలు అన్ని అందుబాటులో ఉంటాయని.. నిత్యావసర వస్తువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కొరత రాదని సీఎం స్పష్టం చేశారు. కరోనాను సాకుగా చూపించి ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్‌ హెచ్చరించారు. నిత్యావసర వస్తువుల ధరలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని.. గ్రామ సచివాలయాల ద్వారా నిత్యావసర వస్తువులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. (కరోనా: ఒక్కరోజు బస్సులు బంద్‌!)

మాస్క్‌లను సరైన పద్దతిలో డిస్పోజ్‌ చేయాలి
మాస్క్‌లు వాడేవాళ్లు వాటిని సరైన పద్దతిలో డిస్పోజ్‌ చేయాలని సీఎం సూచించారు. మాస్క్‌లను ఎక్కడిపడితే అక్కడ పడేస్తే ప్రమాదకరమన్నారు. ఐదు గంటలకు ఒకసారి మాస్క్‌లను మార్చాల్సి ఉంటుందని.. వైద్య సిబ్బంది కచ్చితంగా మాస్క్‌లు వేసుకోవాలని సీఎం తెలిపారు. 65 ఏళ్లకు పైబడ్డ వయస్సు గలవారికి ఈ వైరస్‌ గట్టి ప్రభావం చూపుతోందన్నారు. అలాగే యువకులు, చిన్న పిల్లల నుంచి ఈ వైరస్‌ వృద్ధులకు సోకితే.. ఇబ్బందిపడేది వృద్ధులేనని పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధులు, సుగర్‌ తో బాధపడేవాళ్లు ఈ వైరస్‌వల్ల తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. అందుకే సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం అవసరమని.. దీన్ని అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపు ఇచ్చినట్టున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటివి ఎక్కువగా చేయాల్సి వస్తుందేమోనని సీఎం అభిప్రాయపడ్డారు. (కోవిడ్‌-19: చైనా కంపెనీ సరికొత్త రికార్డు!)

ఏపీలో కేవలం మూడు కేసులే..
‘‘దేశం మొత్తం మీద కేవలం 191 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మన ఏపీలో కేవలం మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ మూడు  కేసులు కూడా విదేశాల నుంచి వచ్చిన వారే.. ఒకరు ఇటలీ, ఒకరు యూకే, ఇంకొకరు సౌదీ నుంచి వచ్చారని’’ సీఎం పేర్కొన్నారు. కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్న కలెక్టర్లు, అధికారులు, గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులు, ఆశా వర్కర్లు, వాలంటీర్లను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రశంసించారు.

ఆందోళన వద్దు..
ప్రపంచవ్యాప్తంగా 80.9 శాతం మంది కరోనా వైరస్‌ కేసులకు ఇళ్లలోనే ఉంటూ వైద్యం తీసుకోవడం ద్వారా వ్యాధి నయం అయ్యిందని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. 13.8 శాతం మంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరుతున్నారన్నారు. 4.7శాతం కేసులు మాత్రమే ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది నిర్థారిస్తోందన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. దాదాపుగా మనం ట్రీట్‌మెంట్‌ తీసుకున్నట్టేనని సీఎం తెలిపారు. దగ్గు జలుబు ఉంటే అది కరోనానా, లేక ఫ్లూ అన్న సందేహం వస్తుందన్నారు.  పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉంటే... వారు విదేశాల నుంచి వచ్చారా? లేదా అని మొదటి ప్రశ్న అడగాలని.. విదేశాలనుంచి వచ్చిన వ్యక్తులతో వీళ్లు కాంటాక్టులో ఉన్నారా? అన్నది కనుక్కోవాలని సీఎం సూచించారు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించి... వారికి పరీక్షలు చేయించి, వైద్యం అందించాలని సీఎం పేర్కొన్నారు.

ఇది మంచి ఫలితానిస్తోంది..
‘‘ప్రతి గ్రామ సచివాలయానికి ఒక ఏఎన్‌ఎం, ఇద్దరు ఆశావర్కర్లు ఉన్నారు. వీరే కాకుండా ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ ఉన్నారు. ఒక యాప్‌ను వాళ్ల ఫోన్లలో అందుబాటులోకి ఇచ్చాం. ఈ యాభై ఇళ్లకు సంబంధించి డేటాను కలెక్ట్‌ చేసి ఉంచుతున్నారు. ఎవరైనా విదేశాల నుంచి వస్తే.. ఏ తేదీలో వచ్చారు.. ఎప్పుడు వచ్చారు.. ఆయన ఇంటిలో ఎంతమంది ఉన్నారు.. ఆరోగ్య పరిస్థితిపై వైద్య శాఖకు నిరంతరం డేటా పంపుతున్నారు. కరోనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తే గ్రామ సచివాలయాల్లో ఉన్న ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు  తక్షణమే అలర్ట్‌ అవుతున్నారు. దగ్గర్లో ఉన్న ఆసుపత్రిని కూడా అలర్ట్‌ చేస్తున్నారు. ఇది మంచి ఫలితాలను ఇస్తోందని’’  సీఎం జగన్‌ పేర్కొన్నారు.

కరోనా కట్టడికి జిల్లాస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌లు
జిల్లా స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేశామని.. కలెక్టర్లను కన్వీనర్‌గా నియమించామని సీఎం తెలిపారు. జిల్లా వైద్యాధికారి, డీసీహెచ్‌స్‌లు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారన్నారు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా టాస్క్‌ ఫోర్స్‌ సమావేశం జరిపి నిరంతరం పర్యవేక్షణ జరగాలని సీఎం చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దని సూచించారు. బస్సుల్లో శుభ్రత పాటిస్తున్నారా.. శానిటైజ్ చేస్తున్నారా అన్నది చూడాలన్నారు. జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులను కలెక్టర్లు తనిఖీ చేయాలన్నారు. కావాల్సిన మందులు ఉన్నాయా.. లేదా అన్నది తనిఖీ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌  ఆదేశించారు.

ముందు జాగ్రత్త చర్యలు కోసమే..
స్కూళ్లకు సెలవులు ప్రకటించడం, ఇండోర్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌లు, థియేటర్లు, మాల్స్‌ మూసివేయడం, పెద్ద దేవాలయాలు, జిమ్స్, స్విమ్మింగ్‌ పూల్స్‌ మూసి వేయాలంటూ.. తీసుకున్న చర్యలన్నీ ముందస్తు జాగ్రత్తల కోసమేనని సీఎం వివరించారు. ‘‘స్థానిక సంస్థ ఎన్నికలు జరిగి ఉంటే.. వ్యవస్థ మరింత బలోపేతంగా ఉండేది. సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రజల తరపున బాధ్యతగా ఉండే వారు. కాని దురదృష్టవశాత్తూ కొన్ని కారణాల వల్ల జరగలేదు. కాని మనకు గ్రామ వాలంటీర్లు, సచివాలయాల రూపంలో మంచి వ్యవస్థ ఉంది.  ఆ వ్యవస్థను వాడుకోవాలి. మీరు నిరంతరం పర్యవేక్షణ ఇస్తూ.. వారిని చైతన్యం చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ మన బలం. వచ్చే రోజుల్లో ప్రతి విలేజ్‌ క్లినిక్స్‌ను తీసుకువస్తాం. ఈలోగా మనకున్న సిబ్బందిని సరిగ్గా వాడుకోవాలి. పీహెచ్‌సీల్లో, ఆస్పత్రుల్లో కచ్చితంగా సిబ్బంది ఉండేలా చూసుకోవాలి. హోం ఐసోలేషన్, సోషల్‌ డిస్టెన్స్‌ మీద ప్రధాన దృష్టిపెట్టాలని’ కలెక్టర్లకు సీఎం సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement