సాక్షి, అమరావతి: నాలుగేళ్లలో 30 లక్షల గృహాలు.. మరో సంచలన నిర్ణయంతో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు దాదాపు 30 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. నాలుగేళ్లలో వీటి నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. గృహ నిర్మాణశాఖపై శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీరంగనాథరాజు, అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. గూడులేని నిరుపేదల సొంతింటి కలను 2024 నాటికి నెరవేర్చే దిశగా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఇళ్లపై పూర్తిస్థాయిలో దృష్టి
పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన కార్యాచరణ, ఏటా చేరుకోవాల్సిన లక్ష్యాలపై సమావేశంలో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఇవ్వనున్న ఇళ్ల పట్టాలు, నిర్మించాల్సిన ఇళ్లపై పూర్తిస్థాయిలో సమీక్షించారు. పట్టణ, నగరాభివృద్ధి సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఇప్పటివరకు మంజూరైన వాటి వివరాలను పరిశీలించారు. రాష్ట్రానికి ఇంకా ఎన్ని ఇళ్లు మంజూరు కావడానికి ఆస్కారం ఉందో గుర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ మేరకు నిధులు అవసరమవుతాయో సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.
సీఎం సమీక్షలో ఇతర ముఖ్యాంశాలు...
– ఈ ఉగాదికి పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ.
– ప్రస్తుతం పట్టాలు పొందే పేదలతోపాటు సొంతంగా ఇళ్ల స్థలాలున్న పేదలకూ ఇళ్లు మంజూరు.
– రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్టీలు, నగరాభివృద్ధి సంస్థల పరిధిలో 19.3 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక.
– ఒక పడక గది, వంట గది, వరండా, మరుగుదొడ్డి ఉండేలా ఇళ్ల డిజైన్ తయారీ.
– ఇళ్లన్నీ ఒకే నమూనాలో అత్యంత నాణ్యంగా, అందంగా ఉండేలా నిర్మాణం.
– 14,097 వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణం.
– గృహ నిర్మాణ శాఖలోని 4,500 మంది ఇంజనీర్లతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా నియమించిన 45 వేల మంది సిబ్బంది పేదలకు అందచేసే 30 లక్షల ఇళ్ల నిర్మాణ క్రతువులో పాలుపంచుకుంటారు.
– అధిక వడ్డీలతో పేదలు ఇతరులపై ఆధారపడాల్సిన దుస్థితి లేకుండా గృహాల నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక్కో ఇంటిపై రూ.25 వేల వరకు పావలా వడ్డీకే బ్యాంకు రుణం అందచేసి మిగిలిన వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది.
– పేదల కోసం నిర్మిస్తున్న కాలనీల్లో పెద్ద ఎత్తున చెట్లు నాటడంతో పాటు సమగ్ర మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేస్తారు.
– కాలనీల్లో విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment