హైదరాబాద్: విశాఖపట్నం ఆర్డీవోను బదిలీ చేసే విషయంలో టీడీపీ నాయకులు గొడవ పడిన విషయాన్ని అధికారులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. సీఎంవో అధికారుల పట్ల మంత్రి అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే రామకృష్ణ వ్యవహరించిన తీరును చంద్రబాబుకు వివరించారు. కార్యాలయం తలుపులు తీసి మరీ గట్టిగా గొడవ పడ్డారని సీఎంవో అధికారులు బాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖ జిల్లాకు చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య నెలకొన్న విభేదాలు ఆర్డీవోల బదీలీల వ్యవహారంతో మరింత రచ్చకు దారితీసిన సంగతి తెలిసిందే. రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి నిర్ణయం మేరకు జరిగిన ఆర్డీవోల బదిలీలను మంత్రి గంటా అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సచివాలయం ఎల్ బ్లాకులోని సీఎం కార్యాలయ ఉన్నతాధికారి వద్దకు వెళ్లి, తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. బదిలీలను మీరెలా అడ్డుకుంటారని ఆయనను తప్పుపట్టినట్టు సమాచారం. సీఎంవో అధికారుల తీరు బాగోలేదని, మాట్లాడటానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందంటూ విరుచుకుపడ్డారు. సీఎంవో అధికారులు ఈ విషయాన్ని బాబు దృష్టికి తీసుకెళ్లారు.
'తలుపులు తీసి మరీ గొడవ పడ్డారు'
Published Sat, Nov 15 2014 1:09 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement