టీడీపీ నాయకుల డైరెక్షన్.. కార్యకర్తల యాక్షన్
(సాక్షి ప్రతినిధి, ఏలూరు) : సంక్రాంతి రాకుండానే జిల్లాలో పోలీసులకు, టీడీపీ ప్రజాప్రతినిధులకు కోడిపందాలు వివాదం రాజేశాయి. కోడిపందాల నిర్వహణపై కట్టుదిట్టంగా తమదైన శైలిలో వ్యవహరిస్తోన్న పోలీసుల వైఖరితో ప్రజాప్రతినిధులకు ముచ్చెమటలు పడుతున్నాయి. దీంతో పోలీసులను టార్గెట్ చేస్తూ ఎంపీలు, ఎమ్మెల్యేలు ధర్నాకు దిగడంతో వివాదం తారస్థాయికి చేరింది. కోడిపందాలు ఆడకుండా చూడాలంటూ పోలీసులను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు చేసిన ధర్నా వివాదాస్పదంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది కోడిపందాలు.. పండగ వేళ సంప్రదాయ ముసుగులో జరిగే ఈ కోడిపందాలు చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా ప్రత్యేకంగా వస్తుంటారంటే దీనికున్న క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి పండగ ముందు రోజు నుంచి మొదలయ్యే కోడిపందాల జోరు ఈసారి కొత్త సంవత్సరం రాకుండానే ఊపందుకుంది.
జిల్లాలోని అన్ని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలు గెలుచుకుని టీడీపీ అధికారంలోకి రావడంతో కార్యకర్తలు ప్రజాప్రతినిధుల భరోసాతో ముందస్తుగానే కోడిపందాలు ఆడటం ప్రారంభించారు. అయితే కోడిపందాలు, దానిపై బెట్టింగ్‌లతో చాలామంది తమ ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసుకుంటున్న నేపథ్యంలో ఏలూరుకు చెందిన ఓ న్యాయవాది వేసిన పిల్‌పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు కోడిపందాలకు అడ్డుకట్ట వేయాలని డీజీపీ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ఈ జూదంపై ఉక్కుపాదం మోపింది. జిల్లావ్యాప్తంగా కోడిపందాల నిర్వాహకులను గుర్తించే చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే 300 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. మరోవైపు కోడిపందాల వల్ల జరిగే అనర్థాలపై భీమవరం విద్యార్థులు రూపొందించిన డాక్యుమెంటరీతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నాలు ఆరంభించారు.
బ్రహ్మయ్య అరెస్ట్ సాకుతో...
సరిగ్గా ఇదే సమయంలో ద్వారకాతిరుమల మండలం వేంపాడు గ్రామంలో 15 రోజులుగా రాత్రిపూట కోడిపందాలు నిర్వహిస్తోన్న విషయాన్ని పోలీసులు గుర్తించి రెండు రోజుల క్రితం దాడులు చేశారు. 17 మంది పందెం రాయుళ్లను అరెస్ట్ చేసి రూ.4 లక్షల వరకూ నగదు, కార్లు, మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కోడిపందాల నిర్వాహకుడిగా గుర్తించిన టీడీపీ నేత, రామన్నగూడెం సహకార సంఘం అధ్యక్షుడు సుంకవల్లి బ్రహ్మయ్యపై ఛీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. దీంతో రగిలిపోయిన తెలుగు తమ్ముళ్లు మంగళవారం నాటి జిల్లా విజిలెన్స్ సమీక్షా సమావేశానికి వచ్చిన ఎంపీలు మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్, గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు కలవపూడి శివ, గన్ని వీరాంజనేయులును ఘెరావ్ చేశారు.
పోలీసులపై తమ అక్కసు వెళ్లగక్కేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న టీడీపీ నేతలు ఇదే అదనుగా కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు. జెడ్పీ మీటింగ్ హాలు ఎదుట ధర్నా చేపట్టారు. జిల్లా ఎస్పీ, పోలీసులే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ హైడ్రామా చివరికి ఎస్పీ మాట్లాడిన రెండే రెండు మాటలతో చప్పున చల్లారింది. ధర్నా అనంతరం కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ రఘరామ్‌రెడ్డితో టీడీపీ ప్రజాప్రతినిధులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత ఎస్పీ బయటకు వచ్చి ద్వారకాతిరుమల ఎస్సై తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకుంటాం.. కోడి పందాలకు సంబంధించిన అరెస్ట్‌లపై న్యాయనిపుణుల అభిప్రాయాలు తీసుకుంటాం.. అని వ్యాఖ్యానించి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎస్సైని వీఆర్‌లోకి పంపిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
ఏం ఒరిగింది?
జిల్లా స్థాయి విజిలెన్స్ సమావేశాన్ని నాలుగున్నర గంటలు బహిష్కరించి నానాయాగీ చేసిన టీడీపీ నేతలకు ఏం ఒరిగిందంటే ఎవరి వద్దా సరైన సమాధానం లేదు. ప్రభుత్వపరంగా పరిష్కరించాల్సిన ఎన్నో సమస్యలతో జనం కొట్టుమిట్టాడుతుంటే బాధ్యత కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు సరదా కోసం ఆడే కోడిపందాల కోసం ఇలా రోడ్డెక్కడం విమర్శలపాలైంది.