బరి తప్పిన బాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కచ్చితంగా పందెం కోడిని ఎత్తించాలన్న టీడీపీ నేతల వ్యూహాలు బెడిసికొట్టాయి. జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో సీఎం ఎదుట కోడి పందాల పంచాయితీ పెట్టి, సంక్రాంతి నాలుగు రోజుల వరకైనా అనధికారిక అనుమతులు సాధించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. చాటపర్రులో ఎంపీ మాగంటి మురళీమోహన్ స్వగృహం సమీపంలోనే తొమ్మిది పందెం కోళ్లను సిద్ధం చేశారు. బరి కూడా వేశారు. సీఎం రావడానికి ఓ గంట ముందు ఎంపీ మాగంటి బాబు, ఆయన తనయుడు రామ్‌జీ పందెం కోళ్లను పట్టుకుని పందాలకు ఉసిగొల్పారు. ఈ దృశ్యాలను సీఎం బహిరంగ సభకు వచ్చిన వారికి టీవీ స్క్రీన్ల ద్వారా చూపించారు. దీంతో సీఎం వచ్చాక కోడి పందాలకు అనుమతి షురూ అవుతుందని తమ్ముళ్లు భావించారు.
రెండు నెలల కిందట కలవపూడి పర్యటనలో బాబు స్వయంగా పందెం కోడిని ఎత్తుకోవడంతో ఇప్పుడు చాటపర్రులో కూడా అదేవిధంగా చేసి పందాలకు శ్రీకారం చుట్టించాలని టీడీపీ నేతలు భావించారు. అయితే ముందస్తు వ్యూహమో, సమయాభావమో గానీ చంద్రబాబు మాత్రం పందెం కోళ్ల వైపు, బరివైపు కన్నెత్తి చూడలేదు. హడావుడిగా ఉన్న చంద్రబాబుతో ఆ విషయంపై మాట్లాడే సాహసం కూడా నేతలు చేయలేదు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే సీఎం కోడి పందేల వ్యవహారాన్ని పట్టించుకోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా చంద్రబాబు వచ్చినా పందెం కోడి కూత వేయకపోవడంతో నిన్నటివరకు సీఎం గారొస్తేనా.. అంటూ బీరాలు పోయిన నేతలు ఇప్పుడు నోరునొక్కుకున్నారు.
ఎంపీడీవో ఓవర్ యాక్షన్
చాటపర్రులో సభా వేదికపై దెందులూరు ఎంపీడీవో ఎన్.ప్రకాశరావు విన్యాసాలు అధికార వర్గాలకూ చికాకు తెప్పించాయి. మైక్ పట్టుకున్న ఆయన ‘ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎక్కడ... వెంటనే డయాస్‌పైకి రావాలి.. ఇక్కడ లైట్లు వెలగడం లేదు.. ఎక్కడ ఎస్‌ఈ..’ అంటూ హల్‌చల్ చేయడంతో అధికారు లు, ఉద్యోగులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎంత మైక్ ఇస్తే మాత్రం ఓ జిల్లాస్థాయి అధికారిని లైట్లు వెలిగిం చాలి పైకి రా.. అని ఎలా పిలుస్తారం టూ వ్యాఖ్యానించటం కనిపించింది.
టైగర్.. టైగర్..
అదే ఎంపీడీవో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పదే పదే టైగర్.. టైగర్ అని సంభోదించడం కూడా చర్చనీయూంశమైంది. సహజంగా అభిమానులు, కార్యకర్తలు తమ నాయకులను టైగర్ అనో... సింహమనో అని పిలుచుకుంటారు. ప్రభుత్వోద్యోగి అయిన ప్రకాశరావు ఎమ్మెల్యేను బహిరంగ సభలో ఒకటికి పదిసార్లు టైగర్ చింతమనేని అని పిలవడం అధికార పార్టీకి వారికీ ఎబ్బెట్టుగా తోచింది.
వెళ్లకండి.. బాబుగారు ఫీలవుతారు
‘ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడొచ్చినా మీరు మీటింగ్ మధ్యలో వెళ్లిపోతుంటారు. ఈసారి అలా వెళ్లొద్దు. ఆయన ఫీలవుతారు. అది మనకు మంచిది కాదు. 200 బస్సులున్నాయి. 6.30 గంటల వరకు ఒక్క బస్సు కూడా కదలదు. లేటవుతుందని బాధపడకండి. ఎవరూ దయచేసి వెళ్లకండి. కంగారు పడకండి’ అంటూ వెళ్లిపోతున్న జనాలను ఆపడానికి అధికారులు నానా కష్టాలూ పడ్డారు.
మాగంటికి మైక్ దొరకలేదు
చాటపర్రు బిడ్డ, ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు గురువారం సొం తూరిలో జరిగిన సీఎం సభలో మాట్లాడటానికి అవకాశం దొరకలేదు. సమయాభావంతో కేవలం ఎమ్మెల్యే ప్రభాకర్, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ మాట్లాడిన తర్వాత మైక్ సీఎం తీసుకున్నారు. మాగంటి బాబు సీఎం వద్దకు రాగా ‘టైమ్ అవుతోంది.. అందుకనే..’ అని సీఎం చెప్పగా, పర్లేదు సార్... అని మాగంటి బాబు వినయంగా ఆయన పక్కనే చేతులు కట్టుకుని నిలబడ్డారు.
చింతమనేని ‘ఫొటో’ వ్యాఖ్యలు
‘మాకు ఓటేయని వాళ్లకు కూడా పిం ఛన్ ఇస్తున్నాం. రుణమాఫీ చేస్తున్నాం. ఓటేయని వాళ్లు కూడా చంద్రబాబు ఫొటో పెట్టుకుని దండం పెట్టుకోవాలి’ అంటూ ఎప్పుడూ వివాదాస్పద వ్యా ఖ్యలు చేసే చింతమనేని గురువారం ఏకంగా సీఎం చంద్రబాబు సమక్షంలోనూ ఇవే వ్యాఖ్యలు చేశారు. ‘గ తంలో ఇలా మాట్లాడితే కొంతమంది అభ్యంతరాలు చెప్పారు.. ఇప్పుడు కూడా నేను అదే అంటున్నాను.. పింఛ న్ తీసుకునే వాళ్లు బాబు ఫొటో పెట్టుకోవాలని అన్నారు. సీఎం చంద్రబాబు ఎక్కడా చింతమనేనిని వారించకుండా ఆనక తన ప్రసంగంలో ఆయనను అభినందించడం గమనార్హం.