మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లా సరిహద్దుల్లో కోడిపందేలు రెండు రోజులుగా జోరుగా సాగుతున్నాయి. హనుమాన్‌జంక్షన్ సమీపంలో.. పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలం తాళ్లమూడి వద్ద, కృత్తివెన్ను పల్లెపాలెం సమీపంలోని లోసరి వద్ద భారీఎత్తున పందేలు వేశారు. లోసరిలో నిర్వహించిన కోడిపందేల శిబిరాన్ని 16 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు రెండు రోజులపాటు సందర్శించారు. జిల్లాలో కోడిపందేలు, పేకాట జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు పోలీసులు చేసిన హెచ్చరికలు అభాసుపాలయ్యాయి.
జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు ప్రకటించినా..ఈ అవరోధాలన్నింటినీ దాటి పందెంరాయుళ్లు తమ పంతం నెగ్గించుకున్నారు. మొవ్వ మండలం కోసూరు, పామర్రు మండలం జమిగొల్వేపల్లిలో కోతముక్క జోరుగా సాగింది. ఒకవైపు పోలీసులు దాడి చేస్తున్నా.. మరో వైపు పందెగాళ్లు సెల్‌ఫోన్ల ద్వారా సమాచారం పంపుతూ ఎక్కడికక్కడే పందేలు నిర్వహించారు.
విజయవాడ కమిషనరేట్ పరిధిలో కోడిపందేలకు అనుమతులు లేకపోవడంతో ఆ ప్రాంతంవారంతా జిల్లాలోని పలుచోట్లకు తరలివెళ్లి పండగను సరదాతీర్చుకున్నారు. రెండు రోజులుగా జిల్లాలో కోడిపందేలు, పేకాటల రూపంలో రూ. 50 కోట్లకు పైగానే చేతులు మారినట్లు సమాచారం.
పందేలు జరిగిన తీరిదీ..
కైకలూరు మండలం భుజబలపట్నం, కలిదిండి మండలం పులపర్రు, చింతలపాడులో శిబిరాలు ఏర్పాటుచేసి పెద్దఎత్తున కోడిపందేలు నిర్వహించారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాజీ మంత్రి మాగంటి బాబు స్వయంగా పోటీలను ప్రారంభించారు. ఇక్కడ రెండు రోజుల పాటు యథేచ్ఛగా పందేలు జరిగాయి.
గుడివాడ పట్టణం, మండలం సరిహద్దుల్లో రెండు ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు పోటాపోటీగా రెండు శిబిరాలు ఏర్పాటు చేసి కోడిపందేలు నిర్వహించారు.
నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి, ఆగిరిపల్లి, ముసునూరు, నూజివీడు ప్రాంతాల్లో కోడిపందేలకు అడ్డు, అదుపు లేకుండాపోయింది.
మైలవరంలోని దేవుడు చెరువు, సూరిబాబుపేట, పోరాటనగర్, కనిమెర్లతండా, పుట్లూరు తదితర ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా సాగాయి.
అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల మండలం శ్రీకాకుళం, పాపవినాశనం గ్రామాల సరిహద్దులో కరకట్ట పక్కనే పెద్ద ఎత్తున కోడిపందేల శిబిరం నిర్వహించారు. శ్రీకాకుళం రేవు వద్ద పందెంరాయుళ్ల రాకతో తిరునాళ్లను తలిపించింది.
పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ మండలం పెడసనగల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన కోడిపందేల శిబిరాన్ని మంత్రి పార్థసారథి రెండు రోజులూ వచ్చి సందర్శించారు. బల్లిపర్రు, పామర్రు, కురుమద్దాలి, పెరిసేపల్లి, యలకుర్రు తదితర ప్రాంతాల్లో జోరుగా పేకాట, కోడిపందేలు సాగాయి.
పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి మండలం పెందుర్రులో భారీగా కోడిపందేల బరిని ఏర్పాటు చేశారు. ఇక్కడ పగలు సమయంలో కోడిపందేలు, రాత్రి సమయంలో కోతముక్క జోరుగా సాగాయి. నాగేశ్వరరావుపేట, అర్తమూరు, చెరుకుమిల్లి తదితర ప్రాంతాల్లో కోడిపందేలు ఇష్టారాజ్యంగా సాగాయి.
కృత్తివెన్ను మండలం పల్లెపాలెం సమీపంలో పశ్చిమగోదావరి జిల్లాలోని లోసరి వంతెనకు సమీపంలో పంటపొలాల్లో పెద్దఎత్తున పందేలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని 16 మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు సందర్శించటం గమనార్హం. గూడూరు మండలంలోని పిండివానిపాలెం, గూడూరు, పెడన మండలం తోటమూల, కట్లపల్లి, ఉప్పలకలవగుంట తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున కోడిపందేలు నిర్వహించారు.
బందరు మండలంలోని పోలాటితిప్ప, కోన, చిన్నాపురం, కానూరు తదితర ప్రాంతాల్లో పేకాట, కోడిపందేలు జోరుగా సాగాయి.
పందెంకోళ్లు కత్తులు దూశాయ్!
Published Thu, Jan 16 2014 6:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement