
వంటనూనె తయారీ యంత్రాన్ని పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారులు, (ఇన్‌సెట్లో) బొద్దింకలతో నిండిన యంత్రం పరిసరాలు
అందమైన ప్యాకింగ్.. ఆకట్టుకునే ప్రచారం.. ఇవే ఇప్పుడు వ్యాపార రహస్యాలు.ఆ వస్తువులోని నాణ్యత.. తయారీ ప్రాంతంలో పాటిస్తున్న ప్రమాణాలు ఇవేవీ కనిపించకపోవడంతో ప్రజలు బోల్తా పడుతున్నారు. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. జిల్లా కేంద్రం అనంతపురంలో విజిలెన్స్ అధికారులుఓ ఆయిల్ ట్రేడర్ దుకాణంలో తనిఖీ నిర్వహించగా బొద్దింకలుకలగలిసి వంటనూనె గుట్టు రట్టయింది. రూ.10లక్షల విలువ చేసే సరుకును అధికారులు సీజ్ చేశారు.
అనంతపురం సెంట్రల్: నగరంలో ఓ వంటనూనె తయారీదారుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. శుభ్రత పాటించకుండా అపరిశుభ్ర వాతావరణంలో, బొద్దింకల అవశేషాలతో కూడిన నూనె తయారు చేసి, ప్రజలకు అంటగడుతున్నాడు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల తనిఖీల్లో ఈ వ్యవహారం బట్టబయలైంది. వివరాల్లోకెళితే... విజయకుమార్ అనే వ్యాపారి పాతూరులోని తిలక్‌రోడ్డులో వెంకటదత్త ఆయిల్ ట్రేడర్స్ నిర్వహిస్తున్నాడు. అనుమతి లేకుండానే రైతుల నుంచి వేరుశనగ కొనుగోలు చేసి, స్వయంగా నూనె తయారు చేస్తున్నాడు. ఏళ్ల తరబడి యంత్రాలను శుభ్రం చేయకుండా అలానే వినియోగిస్తున్నాడు. అపరిశుభ్రతతో ఆ పరిసర ప్రాంతం కంపు కొడుతోంది. బొద్దింకలు కూడా ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. తయారు చేసిన వేరుశనగ నూనెలో బొద్దింకలు పడి మృతిచెందాయి. అయినా నిర్వాహకుడు వాటిని ఏమాత్రమూ పట్టించుకోలేదు. డబ్బు యావలో పడి ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరించాడు.
దుకాణం సీజ్ : వెంకటదత్త ఆయిల్ ట్రేడర్స్ దుకాణంపై సోమవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజల ప్రాణాలకు హానికలిగించే రీతిలో ఆయిల్ తయారీ చేస్తుండటం చూసి నిర్ఘాంతపోయారు. ఎటువంటి అనుమతి లేకుండానే ఆయిల్ తయారు చేసి విక్రయిస్తున్నట్లు విజిలెన్స్ ఎస్‌ఐ రామకృష్ణయ్య గుర్తించారు. దీంతో దాదాపు రూ. 10లక్షలు విలువజేసే వేరుశనగనూనె, పామాయిల్ స్వాధీనం చేసుకోవడంతో పాటు దుకాణాన్ని సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment