నరసాపురం తీరంలో చేలగట్లపై ఉన్న కొబ్బరిచెట్లు
పశ్చిమగోదావరి, నరసాపురం: జిల్లా పేరు చెబితే వరి తరువాత గుర్తుకు వచ్చేది కొబ్బరి. దేశంలో కేరళ తరువాత ఎక్కువగా కొబ్బరి ఎగుమతులు చేసేది మన రాష్ట్రమే. అందులో ఉభయగోదావరి జిల్లాలదే అగ్రస్థానం. ఇందులో మన జిల్లా స్థానం ప్రత్యేకమైనది. ప్రస్తుతం కొబ్బరి సాగు ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. బయట మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి రూ.15 నుంచి రూ.20 వరకు కాయ ధర పలుకుతుండగా.. రైతుకు మాత్రం రూ.3 నుంచి రూ.5 వరకూ మాత్రమే దక్కుతోంది. డిమాండ్‌ను బట్టి ఒక్కోసారి రైతుకు మరో అర్ధరూపాయో, రూపాయో అదనంగా దక్కడం గగనం. కేవలం రైతులే కాకుండా కొబ్బరి దింపు, వలుపు, లారీలు, ట్రాక్టర్లలోకి లోడు చేయడం, దించడం ఇలా.. జిల్లాలో కొబ్బరి పరిశ్రమపై ఆధాపరడి వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇంకోవైపు జిల్లాలో కొబ్బరిసాగు విస్తీర్ణం ఏటా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆక్వా సాగు పెరగడం ఇందుకు కారణంగా కానిపిస్తోంది. గడిచిన దశాబ్దం కాలంగా కొబ్బరితోటలు విపరీతంగా రియల్ ఎస్టేట్ భూములుగా మారిపోతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో కొబ్బరిసాగు, పరిశ్రమ కూడా సంక్షోభంలోకి వెళుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
డిమాండ్ ఉన్నా.. రైతుకు లాభం లేదు
జిల్లాలో పాలకొల్లు కేంద్రంగా కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి విస్తృతంగా అవుతున్నాయి. రోజుకు 50 లారీలకు తక్కువ కాకుండా ప్రతిరోజూ ఎగుమతి జరుగుతోంది. ఈ లెక్కన జిల్లా నుంచి రోజుకు రూ.1 కోటి నుంచి రూ.1.50 కోట్ల వరకూ జార్ఖండ్, హర్యానా, ఛత్తీస్‌గడ్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు కొబ్బరి ఉత్పత్తుల ఎగుమతి జరుగుతోంది. ఉత్తర భారతదేశంలోని 14 రాష్ట్రాలకు ఇక్కడ నుంచే కొబ్బరి ఎగుమతులు జరుగుతాయి. కోఫ్రా (పైచెక్క తొలగించిన కురిడి), ఇడిబుల్ కోఫ్రా (ఆయిల్‌కు వినియోగించే విధంగా ముక్కలు చేసినవి), కోఫ్రా స్లైస్ (తరుము) రింగ్స్ అండ్ స్లైసెస్ (కురిడికాయను చిన్నచిన్న ముక్కలుగా చేసినవి) మాత్రం విదేశాలకు ఎగుమతి అవుతాయి. కొబ్బరికి ఇంత డిమాండ్ ఉంది. అయితే కొబ్బరి రైతులకు డిమాండ్‌కు అనుగుణంగా ధర దక్కడంలేదు. గుంటూరు, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల్లో కాయ ధర రూ.25 నుంచి రూ.30 ఉండగా, ఇతర రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువ ధర పలుకుతోంది. ఇక్కడి రైతుకు మాత్రం రూ.5, లేదంటే మరో రెండు, మూడు రూపాయలు మాత్రమే దక్కుతుంది. దీంతో రైతులు చాలాకాలంగా దారుణంగా నష్టపోతున్నారు.
తగ్గుతున్న విస్తీర్ణం
జిల్లాలో కొబ్బరిసాగు విస్తీర్ణం దారుణంగా తగ్గిపోతోంది. ఆక్వా సాగు పెరగడంతో భూములు చెరువులుగా మారడం ఒక కారణమైతే, కొత్తగా కొబ్బరిసాగుకు రైతులు మొగ్గు చూపకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. జిల్లాలో 22 మండలాలల్లో కొబ్బరి సాగు జరుగుతుండగా, నరసాపురం, పాలకొల్లు, ఆచంట, పోడూరు, యలమంచిలి మండలాలల్లో ఎక్కువగా ఉంది. కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, పెదవేగి, ద్వారాకాతిరుమల, జంగారెడ్డిగూడెం, భీమడోలు, నల్లజర్ల మండలాల్లో కూడా చెట్లను పెంచుతున్నారు. డెల్టాలో చేను గట్ల మధ్య ఎక్కువగా పెంచుతుండగా, మెట్టలో తోటల పెంపకం కొంచెం ఎక్కువే. పదేళ్ల క్రితం జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరితోటలు ఉండగా, ప్రస్తుతం 98 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరో పదేళ్లలో 20 వేల ఎకరాల్లో చెట్లు మాయమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కొబ్బరి ఎగుమతులకు సంబంధించి ఒలుపు, లోడింగ్, ట్రాన్స్‌ఫోర్ట్, వ్యాపారం ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఈ రంగంపై జిల్లాలో 20 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. కొబ్బరి సాగులో సంక్షోభం తలెత్తితే వీరందరకీ గడ్డు పరిస్థితి తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment