కొబ్బరి రైతులను ముంచుతున్న ఆక్వా | Coconut Size Decreased Due to Aquaculture in Konaseema | Sakshi
Sakshi News home page

నారికేళం.. చిక్కెను రూపం

Published Fri, Jun 28 2019 12:32 PM | Last Updated on Fri, Jun 28 2019 12:40 PM

Coconut Size Decreased Due to Aquaculture in Konaseema - Sakshi

సైజు తగ్గుతున్న కొబ్బరికాయలు

సాక్షి, అమలాపురం: కోనసీమ కొబ్బరి రైతుకు కొత్త కష్టమొచ్చింది. ఆక్వా సాగు పుణ్యమాని తూర్పు గోదావరి జిల్లాలో వందలాది కొబ్బరి చెట్లు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు రొయ్యలు, చేపల చెరువులున్న ప్రాంతాల్లో కొబ్బరి కాయ సైజు గణనీయంగా తగ్గిపోతోంది. గడచిన ఐదేళ్ల కాలంలో కాయ సైజు సగటున 100 గ్రాముల వరకు తగ్గినట్టు అంచనా. కొబ్బరి ధర పతనానికి.. మార్కెట్‌ సంక్షోభానికి కాయ సైజు తగ్గడం కూడా ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. నాణ్యమైన దిగుబడి ఉండే తోటల్లో పక్వానికి వచ్చిన కొబ్బరి కాయ సగటు బరువు డొక్కతో కలిపి 600 గ్రాముల వరకు ఉంటుంది. డొక్క తీసిన తరువాత కాయ బరువు మన రాష్ట్రంలో సగటున 450 గ్రాములు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, విజయనగరం జిల్లాలో అయితే 450 నుంచి 500 గ్రాముల వరకు బరువు ఉంటుంది. తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో డొక్క తీసిన కాయ బరువు 500 గ్రాముల వరకు, కేరళలో 550 గ్రాముల వరకు వస్తోంది.

మన రాష్ట్రంలో కొబ్బరి తోటలకు పెట్టింది పేరైన కోనసీమతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో వలిచిన కాయ సగటు బరువు 400 గ్రాముల వరకు ఉండేది. ఇప్పుటికీ ఆరోగ్యకరమైన తోటల్లో దిగుబడి ఇంచుమించు ఇదే విధంగా ఉంది. కానీ.. తీరప్రాంత మండలాలు, ఆక్వా చెరువులు ఉన్న మండలాల్లో మాత్రం కాయ బరువు గణనీయంగా తగ్గుతోంది. ఇక్కడ వలిచిన కాయ సైజు 250 గ్రాములకు మించడం లేదని రైతులు వాపోతున్నారు. కాయ బరువు తగ్గడమే కాదు.. కాయ స్వరూపం మరింత కోలగా మారిపోతోంది. కోనసీమతోపాటు తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ఐ.పోలవరం, ముమ్మిడివరం, తాళ్లరేవు, తొండంగి మండలాల పరిధిలో ఆక్వా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి ఎక్కువగా సాగయ్యే నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఆకివీడు తదితర మండలాల్లో సుమారు 25 వేల ఎకరాలకు పైబడి కొబ్బరి తోటలు ఆక్వాబారిన పడి కాయ సైజు తగ్గిపోతోంది.

ఉప్పు వల్ల ముప్పు
ఇటీవల ఆక్వా సాగు విస్తీర్ణం పెరుగుతున్న స్థాయిలోనే కొబ్బరికి నష్టం కలుగుతోంది. ఆక్వా ప్రభావం వల్ల ఇప్పటికే వందలాది కొబ్బరి చెట్లు మోడువారిన విషయం తెలిసిందే. ఇది వెనామీ రొయ్యల్ని పెంచే చెరువు గట్ల మీద ఉన్న కొబ్బరి చెట్లకు మాత్రమే పరిమితమైందని రైతులు భావించేవారు. కానీ.. భూమి పొరల ద్వారా వస్తున్న ఆక్వా ఉప్పు నీటివల్ల కలుగుతున్న నష్టాన్ని గుర్తించలేకపోయారు. ఆక్వా సాగు చేస్తే చెరువు చుట్టూ సుమారు 2 కిలోమీటర్ల పరిధిలోని భూమిలో సూక్ష్మ పోషకాలు నశించడంతోపాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. నీరు ఉప్పగా మారిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకున్నవారు లేరు. దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. కొబ్బరికి భూమి ద్వారా సహజ సిద్ధంగా అందే నీరు ఉప్పగా మారడంతో తెగుళ్లు, పురుగుల దాడిని తట్టుకునే శక్తిని కోల్పోతోంది. మరోవైపు పోషకాలు అందక కొబ్బరికాయ సైజు తగ్గుతోంది. ఫలితంగా ఇక్కడ పండే కొబ్బరి కాయలకు డిమాండ్‌ తగ్గి ధర పడిపోతోంది. ఇతర రాష్ట్రాల్లో పండే కొబ్బరి కాయల్లో నూనె శాతం 69 ఉంటే.. ఇక్కడి కాయల్లో 61 శాతం మాత్రమే ఉంటోంది. ఫలితంగా ఈ ప్రాంత కొబ్బరి ధరలు దారుణంగా పతనమయ్యాయి. రానున్న రోజుల్లో మరింతగా దిగజారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఉప్పు సాంద్రత ప్రమాదకర స్థాయిలో ఉంది
ఆక్వా సాగు వల్ల, సముద్రం ఎగదన్ని వస్తున్నందు వల్ల నదులు, మురుగునీటి కాలువల్లో ఉప్పు సాంద్రత ప్రమాదకర స్థాయికి పెరిగింది. భూగర్భ జలాలు సైతం ఉప్పు బారిన పడుతున్నాయి. మరోవైపు కొబ్బరి ఆక్వా బారిన పడటంతో రోగ నిరోధక శక్తి తగ్గుతోంది. కోనసీమలో చాలాచోట్ల లవణాల సాంద్రత 2000 పీపీఎం దాటింది. ఇది ప్రమాద తీవ్రతకు సూచిక. ఈ పరిస్థితులే కొబ్బరి కాయ సైజు తగ్గడానికి, దిగుబడి పడిపోవడానికి కారణం.
– డాక్టర్‌ పి.కృష్ణకిశోర్, ప్రిన్సిపాల్, ఎస్‌కేబీఆర్‌ పీజీ కాలేజీ, అమలాపురం

శక్తి హరిస్తోంది
ఆక్వా చెరువుల వల్ల భూగర్భ జలాల్లో లవణ శాతం పెరిగి కొబ్బరి చెట్లకు సూక్ష్మ పోషకాలు, ప్రొటీన్లు అందడం లేదు. దీనివల్ల చెట్టు శక్తిహీనమై దిగుబడి తగ్గుతోంది. గడిచిన ఐదేళ్లలో కాయ సైజు భారీగా తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే కష్టం. ఆక్వా చెరువుల చుట్టూ ఉన్న చెట్లకు నల్లముట్టి పురుగు, తెల్లదోమ ఉధృతి కూడా ఎక్కువైంది.
–ఎన్‌బీవీ చలపతిరావు, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement